తిరుమల శ్రీవారి ఆలయం ముందు పన్నీర్‌సెల్వంతో శేఖర్‌రెడ్డి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో సాగుతున్న ఇసుక అమ్మకాలు అక్రమాల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలకు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి బినామీ కథనాయకుడని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. శేఖర్‌రెడ్డికున్న రాజకీయ అండదండల వల్లనే రూ.33.6 కోట్ల విలువైన కొత్త కరెన్సీ ఆయనకు ఎలా దక్కిందనే విషయం బయటకు రావడం లేదని స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు.
ఎస్‌ఆర్‌ఎస్ కంపెనీ పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు గత ఏడాది డిసెంబరు 8వ తేదీన దాడులు నిర్వహించి రూ.170 కోట్ల నగదు, రూ.178 కిలోల బంగారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్ల కొత్త కరెన్సీ ఉండడం కేసు తీవ్రతను పెంచింది. శేఖర్‌రెడ్డి చేతికి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందో తమకు తెలియదని సీబీఐకి ఆర్‌బీఐ సమాధానం చెప్పడం మరింత కలకలం రేపింది. ఈ కేసు విచారణపై స్టాలిన్ స్పందిస్తూ, ఆర్‌బీఐ అదుపాజ్ఞల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే శేఖర్‌రెడ్డి భారీ మొత్తంలో సొమ్ము ముట్టే అవకాశం ఉంది, అయితే ఆ సొమ్ము ఎలా చేరిందో తమకు తెలియదని ఆర్‌బీఐ చెప్పడం ఆశ్చర్యమే కాదు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కరెన్సీ ముద్రణాలయాలు కేంద్రప్రభుత్వం, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లోని ముద్రణాలయాలు ఆర్బీ ఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయని ఆయన అన్నారు. రూ. 33.6 కోట్లు ఏ ప్రెస్, బ్యాంకు నుంచి శేఖర్‌రెడ్డికి చేరా యో సీబీఐ కనుగొనలేక పోవడం నమ్మశక్యంగా లేదని అన్నారు. శేఖర్‌రెడ్డి కేసులో ఆధారాలు దొరకలేదు, రాష్ట్రంలో గుట్కా అక్రమ అమ్మకాల విచారణలో ఐటీ అధికారులు అందజేసిన ప్రకటన కనపడటం లేదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటైనర్ ద్వా రా రూ.570 కోట్ల రవాణా అయిన సంగతి ఎన్నికల కమిషన్‌కు,ఆర్బీఐకి తెలియకపోవడం విచిత్రమన్నారు.
ఐటీ అధికారుల దాడులన్నీ అంతరంగికం
తమిళనాడుకు సంబంధించి ఐటీ అధికారులు జరిపిన దాడులన్నీ అంతరంగికంగా మారడం గమనార్హమని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ పథకం ప్రకారం అటకెక్కడంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ పరిస్థితుల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంల అక్రమార్జనకు శేఖర్‌రెడ్డి బినామీ కథానాయకుడన్న సంగతిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్థిక అవకతవకలపై తమ పార్టీ వచ్చేనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌డే అనుసరిస్తుండగా, తమకు పోటీగా అదే రోజున దేశవ్యాప్తంగా నల్లధన నిర్మూల దినం పాటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికేనని విమర్శించారు. శేఖర్‌రెడ్డికి రూ.33.6 కోట్లు ఎలా వచ్చాయా తెలియని స్థితిలో ఆర్‌బీఐ ఉన్నపుడు కేంద్రప్రభుత్వ నల్లధన నిర్మూలన ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. శేఖర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమార్జనలపై జరిపిన ఐటీ దాడులపై వెంటనే చర్య తీసుకునేలా నల్లధన నిర్మూలనం రోజున కేంద్రం ఒక ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే, శేఖర్‌రెడ్డికి రూ.2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయనే వివరాలను ఆర్‌బీఐ అధికారులు వెంటనే సీబీఐకి అందజేసి చార్జీషీటు దాఖలుకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment