వారం తర్వాత ఆఫీసుకు పన్నీరు సెల్వం
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వారం రోజుల తర్వాత సెక్రటేరియట్లోని తన కార్యాలయానికి వచ్చారు. సోమవారం పన్నీరు సెల్వంతో పాటు ఆయనకు మద్దతు ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ కూడా సెక్రటేరియట్కు వచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా ఈ రోజు సెక్రటేరియట్‌కు వెళ్లారు. ఆయన పన్నీరు సెల్వంతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే సచివాలయంలో కాసేపు ఉన్న స్టాలిన్.. సెల్వంతో కలవకుండానే వెనుదిరిగారు.
ఈ రోజు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పోయెస్ గార్డెన్‌లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆమె గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ వర్గీయులు తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తర్వాత సెల్వం సంచలన ప్రకటన చేశారు. దీంతో అన్నా డీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ వేడెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం వర్గాలుగా ఆ పార్టీ నాయకులు విడిపోయారు. ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం వర్గం ప్రయత్నిస్తుండగా, ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు శశికళ వర్గం ప్రయత్నిస్తోంది.