'రూటు' మార్చిన పన్నీరు సెల్వం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రజలకు చేరువయ్యేందుకు యాత్ర చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన తమిళనాడు యాత్రను ప్రారంభించారు. నెల రోజుల పాటు రోడ్డు మార్గం ద్వారా పన్నీరు తమిళనాడులో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ర్యాలీలలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రజలతోనూ, పార్టీ కార్యకర్తలను కలుస్తారు.
జయలలిత మరణించాక అన్నాడీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శశికళను వ్యతిరేకించిన పన్నీరు వేరు కుంపటి పెట్టుకున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ తన నమ్మినబంటు పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పన్నీరు వ్యతిరేకించినా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శశికళ మేనల్లుడు దినకరన్.. ఈసీ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయ్యారు. పళని, పన్నీరు వర్గాలు విలీనమయ్యేందుకు చర్చల ప్రతిపాదనకు తెరపైకి తెచ్చాయి. విలీన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా రకరకాలు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు పన్నీరు రూటు మార్చి యాత్రకు బయల్దేరారు.
మళ్లీ తమిళనాడు సీఎం కావడమే లక్ష్యంగా పన్నీరు పావులు కదుపుతున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రజల మద్దతు కూడగట్టడంతో పాటు జయలలిత మృతిపై విచారణ చేయించాలన్న డిమాండ్‌ను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంది. పార్టీ నుంచి శశికళ వర్గాన్ని దూరం చేసేలా పన్నీరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.