
పన్నీర్‌సెల్వం వర్గంపై ఈసీకి ఫిర్యాదు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే నిప్పు ఉప్పుగా ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పన్నీర్ సెల్వం వర్గంపై శశికళ గ్రూప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ పోల్ గుర్తును పన్నీర్ వర్గం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది.
రెండు ఆకుల గుర్తుగా ప్రచారం చేస్తున్నారని గురువారం ఈసీకి ఫిర్యాదు చేసింది. సెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి వీడియో పుటేజ్‌ను కూడా సమర్పించింది. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చేనెల 12న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
బహుముఖ సమరంగా సాగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తీవ్ర కుస్తీలే పడుతున్నారు. బరిలో 62మంది ఉన్నా, ప్రధాన సమరం మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే అమ్మ, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ మధ్య సాగుతున్నదని చెప్పవచ్చు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పురట్చితలైవి అమ్మ అభ్యర్థి మధుసూదనన్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులతో కలిసి ప్రజాకర్షణ ప్రచారంలో ఉన్నారు.