మోదీ ఆశ పడ్డారు ! | panneerselvam comment on the merger of the AIADMK | Sakshi
Sakshi News home page

మోదీ ఆశ పడ్డారు !

Published Thu, Jun 15 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

మోదీ ఆశ పడ్డారు !

మోదీ ఆశ పడ్డారు !

► విలీనంపై పన్నీరు వ్యాఖ్య
► పళనితో ఫలితం శూన్యం ∙అన్నీ నాటకాలే
► ప్రజాభీష్టం మేరకే ఎవరైనా నాయకుడు


ముక్కలైన అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ పడ్డారని అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన సూచనతో విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నానని పేర్కొన్నారు. అయితే,  అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా రాజకీయాల్లో రావొచ్చని, అయితే, ప్రజాభీష్టం మేరకే నాయకుడిగా అవతరించాల్సి ఉంటుందని రజనీ రాజకీయంపై వ్యాఖ్యానించారు.

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మతో ఇక విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. చర్చలకు ఎంపికచేసిన కమిటీని కూడా రద్దుచేశారు. రెండు రోజుల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై బుధవారం మద్దతు నేతలు, ఎమ్మెల్యేలతో పన్నీరు సెల్వం చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సమీక్షించుకున్నారు. ఈసందర్భంగా విలీనం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందంటే.. అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో పన్నీరు స్పందించారు.

మోదీ ఆశపడ్డారు
దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత చేతుల మీదగా మహాశక్తిగా అన్నాడీఎంకే అవతరించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ముక్కలు కావడం వేదన కల్గించినా, పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత తనమీద ఉందన్నారు. అమ్మ ఆశయ సాధనతో పాటు, ఆమె గతంలో తనకు అప్పగించిన బాధ్యతల మేరకు పార్టీని రక్షించుకునేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదని వివరించారు. తాను ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు.

మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడీఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహితపాలన సాగాలంటే, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయటపడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే  ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశపడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తుచేశారు.

నాటకాలు రక్తికట్టాయి
విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని అద్భుతంగా రక్తి కట్టించారని మండిపడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అసలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్‌ చెప్పినట్టుగానే పళనిస్వామి నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నాటకాల్లో కొన్ని ఆధ్యాత్మికంగాను, మరికొన్ని భావోద్వేగంగాను, ఇంకా చెప్పాలంటే, ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగాయని వివరించారు.

దినకరన్‌ నాటకం నమ్మకాన్ని కల్గించలేదని, పళని తృప్తిపరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనానికి ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడీఎంకే ముక్కలైనా కేడర్‌ చెల్లాచెదురు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తనవైపు కిందిస్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటు ప్రజలు కూడా ఉన్నారన్నారు. వారివైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు. అందరూ తలా ఓ దిక్కున ఉన్నారేగానీ, మరో పార్టీలోకి  వెళ్లలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడీఎంకే బలం అన్నా డీఎంకేదేనని, ఇతరులు ఎవరూ కేడర్‌ను తమ వైపునకు తిప్పుకోవడం ఇక్కడ వీలు కాదన్నారు.

రజనీకాంత్‌ రాజకీయాలపై స్పందిస్తూ, ఎవరైనా రావొచ్చని, అయితే, ప్రజల ఆదరణ, అభీష్టం ఉంటే తప్ప, నాయకుడిగా ఎదగలేరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై శరవణన్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఇందులో తమ వాళ్లెవ్వరూ లేరని అన్నారు. ముడుపుల వ్యవహారాల్ని  ఉపేక్షించకూడదన్నారు. చివరగా, సంధించిన ప్రశ్నకు, చిన్నమ్మ శశికళ చేతిలో పళని స్వామి రిమోటే అంటూ, ఆమె కంట్రోల్లోనే ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement