ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ జయలలితను తాను చూడనే లేదుఅని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. కాగా, విచారణలో మంత్రుల పేర్లు బయటకు రావడం, దాన్ని ఖండించే రీతిలోమంత్రులు తమలో భయాన్ని వ్యక్తం చేయడం అనుమానాలకుదారితీస్తున్నట్టు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్ ఎదుట మంగళవారంజయలలిత ప్రత్యేక కార్యదర్శి రామలింగం హాజరయ్యారు.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జయలలితతో సన్నిహితంగా ఉన్న అధికారులు, ఆమె కార్యదర్శులు, భద్రతా అధికారులు, డ్రైవర్లు, వంట వాళ్లు, ఇలా ఏ ఒక్కరినీ వదలి పెట్టకుండా ఆ కమిషన్ విచారణ సాగిస్తోంది. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళ తన వాంగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా సమర్పించారు. ఆమె బంధువులు వివేక్, కృష్ణప్రియ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణల్లో జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసిందెవరు..? అన్న విషయంగా తీవ్రంగానే చర్చ సాగుతోంది. మంత్రులు చూసినట్టుగా కొందరుతమ వాంగ్మూలం ద్వారా స్పందించారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వ, అధికారిక వ్యవహారాల్ని ఆర్థిక మంత్రిగా పన్నీరు సెల్వం తన భుజాన వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సైతం జయలలిత మరణం విషయంగా అనుమానాల్ని లేవదీశారు. ఈ పరిస్థితుల్లో జయలితను తాను చూడలేదన్న విషయానికి కట్టుబడి పన్నీరు సెల్వం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా
మంగళవారం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, జయలలితను తాను చూడనే లేదని స్పష్టంచేశారు. గతంలోనూ ఇదే చెప్పానని, మళ్లీ మళ్లీ ఇదే చెబుతున్నానన్నారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఏ ఒక్క రోజూ తనకు చూడడానికి అవకాశాన్ని ఇవ్వలేదని, అలాంటప్పుడు తాను ఎలా చూస్తానని వ్యాఖ్యానించారు. కాగా, జయలలిత మరణం కేసు విచారిస్తున్న విచారణ కమిషన్ ముందు ఉంచుతున్న వాంగ్మూలాలు మంత్రుల్లో గుబులు రేకెత్తిస్తున్నట్టుందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ విమర్శించారు. మంత్రులు జయలలితను చూసినట్టు కమిషన్ ముందుకు వాదనలు చేరుతుండడంతో వారిలో ఆందోళన బయలుదేరి ఇష్టానుసారంగా స్పందిస్తున్నట్టుందని మండిపడ్డారు.
విచారణకు రామలింగం
జయలలిత మరణం కేసు విచారణకు హాజరవుతున్న వారిని శశికళ తరఫు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే పనిలో పడ్డారు. జయలలిత ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రామలింగం సైతం మంగళవారం విచారణకు హాజరయ్యారు. జయలలితను కలవాలంటే రామలింగం అనుమతి గతంలో తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దృష్ట్యా, ఆయన్ను సైతం విచారణ వలయంలోకి తీసుకొచ్చారు. తనవద్ద ఉన్న సమాచారాలను కమిషన్ ముందు ఆయన ఉంచారు. ఈసందర్భంగా జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమెను ఎవరెవరు పరామర్శించారు...? చూశారు..? అన్న వివరాల్ని రాబట్టే విధంగా ఆ కమిషన్ రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ప్రశ్నల్ని సంధించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment