► అపోలోలో అన్నాడీఎంకే అధినేత్రి జయ
► కరుణానిధికి అస్వస్థత
► పన్నీర్, స్టాలిన్‌లపై ఉప ఎన్నికల గెలుపు భారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ఎన్నికల చరిత్రలో తొలిసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల అధినేతలు ఇద్దరూ ఒకేసారి అస్వస్థలుగా ఉన్న తరుణంలో ఉప ఎన్నికలు రావడం, అభ్యర్థులను గెలిపించే బాధ్యత ద్వితీయశ్రేణి నేతలపై పడడం విచిత్రకరమైన పరిణామం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు, మద్యం, పంచెలు, చీరలు, బహుమతులు పంపిణీ జరిగినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అలాగే తిరుప్పరగున్రం స్థానం నుంచి అన్నాడీఎంకే టికెట్టుపై గెలిచిన శీనివేల్ అనారోగ్య కారణాలతో ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే మృతి చెందారు.
ఈ కారణాలతో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ సాగుతుండగా వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో గెలుపొందడం ద్వారా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. డీఎంకే 98, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. మిత్రపక్షాన్ని కలుపుకుంటే 106 స్థానాలు సాధించుకున్న డీఎంకే తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కేవలం కొద్ది సీట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకున్న అన్నాడీఎంకేకు, 28 సీట్లు తక్కువై తృటిలో అధికారాన్ని కోల్పోయిన డీఎంకేకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో గెలుపు ఎంతో అవసరం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. అన్నాడీఎంకే 4, డీఎంకే 2 దక్కించుకున్నాయి. ఆ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు కాకుండా, డీఎంకే అభ్యర్థులు గెలిచి ఉంటే డీఎంకేకు అదనంగా మరో రాజ్యసభ సీటు దక్కి ఉండేది.
ఆస్పత్రిలో అమ్మ: సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు గడిచిపోయిన ఆరునెలల కాలంలో వచ్చిన ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకేకు ప్రతిష్టాత్మకం. ఒక్క సీటు చేజారినా అధికార పార్టీపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని ప్రచారం చేసేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యంత జనాకర్షణ నేతగా ఎదిగిన జయలలిత ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి లేదు. కనీసం వీడియో కాన్ఫరెన్‌స ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఇప్పట్లో అవకాశం లేదు.
ఉప ఎన్నికల అభ్యర్థులను గెలిపించగల స్థాయిలో జనాకర్షణ కలిగిన నేత అపోలో ఆసుపత్రికి పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీంతో అన్నాడీఎంకేలో అగ్రస్థాయిలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వమే ఉప ఎన్నికల గెలుపు భారాన్ని మోయకతప్పదు. ఆస్పత్రిలో ఉన్న అమ్మ కోలుకుని ఇంటికి రాగానే ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల గెలుపును బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానంగా సీనియర్ మంత్రి పన్నీర్‌సెల్వం పై ఉంది. అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బలమైన ప్రతి పక్షంగా అవతరించిన డీఎంకే అమ్మ అస్వస్థతను అవకాశంగా తీసుకోవడం, మూడు స్థానాల్లో గెలిచేం దుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఈ రకంగా ఉప ఎన్నికలు అన్నాడీఎంకే నేతలకు సవాలుగా మారాయి.
అస్వస్థతతో రాజకీయ కురువృద్ధుడు : డీఎంకే అధ్యక్షులు కరుణానిధి 92 ఏళ్లు దాటిన వయస్సులోనూ తమిళనాడు రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో ప్రచారం కూడా చేశారు. ఎత్తులు వేయడంలో అపర చాణుక్యుడు, రాజకీయ కురువృద్ధుడైన కరుణానిధి సైతం ఉప ఎన్నికల సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులను గెలిపించే బాధ్యత సహజంగానే స్టాలిన్‌పై పడింది. పార్టీకి కాబోయే వారసుడు అని కరుణానిధి ఇప్పటికే స్టాలిన్‌కు కితాబు ఇచ్చిన నేపథ్యంలో ఉపఎన్నికలను స్టాలిన్ ఒక చాలెంజ్‌గా తీసుకునే అవకాశం లేక పోలేదు. అమ్మ ఆసుపత్రికి పరిమితమై ఉన్న తరుణంలో ద్వితీయశ్రేణిలో నాయకత్వ పటిమ, జనాకర్షణలపై అన్నాడీఎంకేతో పోల్చుకుంటే డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎంతో మెరుగు. అమ్మ ప్రచారానికి రాకున్నా ఆమెపై ఉన్న అభిమానం, అనారోగ్య సానుభూతి పవనాలు ఉప ఎన్నికలపై ప్రభావం చూపగలవు.
అలాగే నాయకత్వలేమి, స్టాలిన్‌కు ఉన్న జనాకర్షణ ప్రతికూల ప్రభావానికి కూడా అవకాశం లేక పోలేదు. పార్టీ అగ్రజులు (జయలలిత, కరుణానిధి) ఎన్నికల ప్రచారానికి రాలేని తరుణంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఫలితాలు పన్నీర్ సెల్వం, స్టాలిన్‌లకు సవాలు విసురుతున్నట్లు భావించక తప్పదు.
ద్వితీయానికి సవాల్
Published Fri, Oct 28 2016 2:30 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement