పసుం పొన్ ముత్తు రామలింగం దేవర్ జయంతి | Pasum Pon Ramalingam pearls devar Jayanti | Sakshi
Sakshi News home page

పసుం పొన్ ముత్తు రామలింగం దేవర్ జయంతి

Published Thu, Oct 31 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

Pasum Pon Ramalingam pearls devar Jayanti

సాక్షి, చెన్నై : పసుం పొన్ ముత్తు రామలింగం దేవర్ జయంతిని దక్షిణాది జిల్లాల్లోని వాడవాడలా నిర్వహించారు. ముక్కుళత్తూరు సామాజిక వర్గం ప్రజలు, రాజకీయ నాయకుల నేతృత్వంలో కార్యక్రమాలు జరిగారుు. పాల బిందెలతో ఊరేగింపులు నిర్వహించారు. అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామనాథపురం జిల్లా కౌముదిలోని దేవర్ స్మారక కేంద్రాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో ముస్తాబు చేశారు. బుధవారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు.
 
మంత్రుల నివాళి

దేవర్ స్మారక ప్రదేశంలో తొలుత వేడుకల నిర్వహణ కమిటీ నివాళులర్పించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు వైద్యలింగం, సెల్లూరు కె.రాజు, కామరాజ్, జిల్లా అధికారులు పుష్పాంజలి ఘటించారు. అలాగే డీఎంకే కోశాధికారి స్టాలిన్, ఎండీఎంకే అధినేత వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, పీఎంకే అధ్యక్షుడు జి.కె.మణి నివాళులర్పించారు. స్మారక కేంద్రానికి ఉదయం నుంచి రాత్రి వరకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

ముఖ్యంగా తిరునల్వేలి, శివగంగై, పుదుకోట్టై, మదురై, దిండుగల్, విరుదునగర్, తిరుచ్చి తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఐజీ అభయ్‌కుమార్ నేతృత్వంలో డీఐజీ అమల్‌రాజ్ పర్యవేక్షణలో ఏడు జిల్లాల ఎస్పీలు, ఐదు వేల మంది సిబ్బంది భద్రతా విధులు నిర్వహించారు. మానవరహిత విమానంలో కెమెరాల్ని అమర్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 
ఉద్రిక్తత

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నా స్మారక ప్రదేశం వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవర్ జయంతిని పురస్కరించుకుని ఆ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దీంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. పోలీసుల అత్యుత్సాహం జనానికి ఆగ్రహం తెప్పించింది. ఉదయం మంత్రుల బృందం నివాళులర్పించి బయటకు రాగానే వారికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి.

తమకో న్యాయం, మంత్రులకు మరో న్యాయమా అంటూ గర్జించారు. ఒకానొక సమయంలో మట్టి ముద్దలతో కూడిన రాళ్లను మంత్రుల వాహనాలపైకి విసిరారు. రాళ్ల వర్షం కురవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గట్టి భద్రత మధ్య అక్కడి నుంచి మంత్రుల్ని పంపేశారు. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే పని గట్టుకుని రాళ్లు విసిరిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
చెన్నైలో ఇలా

అన్నాసాలైలోని నందనం సిగ్నల్ వద్ద ఉన్న దేవర్ విగ్రహాన్ని పలు రకాల పువ్వులతో అలంకరించారు. అక్కడ దేవర్ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత ఉదయం నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, విద్యుత్‌శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ తదితరులు నివాళులర్పించారు.

అలాగే డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, టీకేఎస్ ఇళంగోవన్, దక్షిణ చెన్నై పార్టీ కార్యదర్శి అన్భళగన్, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు తంగబాలు, కుమరి ఆనందన్, ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసర్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇలగణేషన్, ఉపాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ఎస్‌ఎంకే ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణ, లక్ష్య డీఎంకే నేత, నటుడు టి.రాజేంద్రన్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చెన్నైలోని డీఎండీకే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ నివాళులర్పించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement