పెరియార్‌కు ఘన నివాళి
సాక్షి, చెన్నై:తమిళనాట పెరియార్‌గా పిలిచే దివంగత ఈవీ రామస్వామి నాయకర్ జాతీయ పార్టీలకు భిన్నంగా 1917లో బ్రహ్మణేతరులతో కూడిన దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1944లో సేలం వేదిగా జరిగిన సభ ద్వారా దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ద్రవిడ కళగం (డీకే) అనే ప్రాంతీయ పార్టీగా మార్చుతూ తీర్మానం చేశారు. అయితే, పెరియార్‌కు అనుంగు శిష్యుడిగా ఉన్న కాంజీవరం నటరాజ అన్నాదురై (సీఎన్ అన్నాదురై) అభిప్రాయ భేదాల కారణంగా ద్రవిడ కళగంను వీడి డీఎంకేను ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు ఆదర్శనీయులు. ద్రవిడ సిద్ధాంత కర్తగా పెరియార్ అవతరిస్తే, ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్తగా అన్నాదురై నిలిచారు.
ఈ ఇద్దరి జయంతి వేడుకలు ఒక రోజు వ్యవధిలో వస్తాయి. ఈనెల 15వ తేదీన అన్నాదురై 106వ జయంతిని ఘనంగా నిర్వహించగా, బుధవారం పెరియార్ 136వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే, డీఎండీకే, డీఎంకే, ఎండీఎంకే, ద్రవిడ కళగం, తందై పెరియార్ ద్రవిడ కళగం ఘనంగా నిర్వహించాయి. వాడ వాడల్లో ఆయన చిత్ర పటాల్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతల నివాళి : చెన్నైలోని సిమ్సన్, జెమిని వంతెన సమీపాల్లో ఉన్న పెరియార్ విగ్రహ పరిసరాల్లో వివిధ పుష్పాలతో అలంకరించారు. సిమ్సన్‌లోని పెరియార్ విగ్రహానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ పార్టీ నాయకులు ఆర్కాడు వీరాస్వామి, సద్గున పాండియన్, వీపీ దురై స్వామి, టీకేఎస్ ఇళంగోవన్, ఆర్ ఎస్ భారతీ, ఎం సుబ్రమణియన్, జే అన్భళగన్, ఆర్‌డి శేఖర్ బాబు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఎండీఎంకే కార్యాలయం తాయగంలోని పెరియార్ విగ్రహానికి ఆ పార్టీ నేతలు వైగో, తిరుప్పూర్ దురైస్వామి, మల్లై సత్యలు నివాళులర్పించారు. డీఎండీకే కార్యాలయంలో పెరియార్‌చిత్ర పటానికి ఆ పార్టీ అధినేత విజయకాంత్, పార్టీ ఎమ్మెల్యేలు పుష్పాంజలి ఘటించారు. జెమిని వంతెన సమీపంలోని పెరియర్ విగ్రహానికి అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, కార్పొరేషన్ మేయర్ సైదై దురై స్వామి, నాయకులు బన్రూటి రామచంద్రన్, విశాలాక్షి నెడుంజలియన్ తదితరులు పూలమాలలు వేశారు. వీసీకే నేత తిరుమావళవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ తదితరులు పెరియార్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుప్పూర్‌లో జరిగిన వేడుకలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో మంత్రుల బృందం పెరియార్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.