మెట్రోలో ప్రయాణించిన మొయిలీ
మెట్రోలో ప్రయాణించిన మొయిలీ
Published Thu, Oct 10 2013 2:43 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం ఉదయం మెట్రోలో ఆఫీసుకు వెళ్లారు. ఇంధన పొదుపు ఆవశ్యకతకు కొత్త పద్ధతులను సూచించే మొయిలీ తుగ్గక్‌లేన్‌లోని తన నివాసం నుంచి నడిచి వచ్చి ఉదయం 9.45 గంటలకు రేస్‌కోర్స్ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ఎక్కారు. పది నిమిషాలు సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌లో దిగి శాస్త్రీభవన్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు.
మీడియా, కెమెరా సిబ్బం ది వెంటరాగా ఆయన తన సిబ్బందితో కలిసి మెట్రో ఎక్కారు. రైలులో కేంద్ర మంత్రిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు వెంటనే తమ మొబైల్ ఫోన్లతో ఆయన ఫొటో తీసుకున్నా రు. నిలబడి ప్రయాణిస్తున్న మంత్రిని చూసి ఒక వ్యక్తి లేచి నిలబడి తన సీటు ఇచ్చారు. కానీ మొయిలీ వారి కోరికను సున్నితంగా తోసిపుచ్చి నిలబడే ప్రయాణించారు.
ప్రయాణాన్ని అస్వాదించా: మొయిలీ
మెట్రో ప్రయాణాన్ని అస్వాదించానని, సాధారణ రోజుల కన్నా త్వరగా కార్యాలయానికి చేరుకున్నామని ఆయన చెప్పారు. కనీసం ఒక రోజైనా రోడ్డుపైనున్న రద్దీలో నుంచి తాను విధులకు వెళ్లడం ఆనందంగా ఉందని విలేకరులతో చెప్పారు. ఇక నుంచి ప్రతి బుధవారం తాను ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. తన అధికార వాహనాన్ని గ్యారేజ్‌లో ఉంచాలని డ్రైవర్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. వారానికి కనీసం ఒక్కరోజైనా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని చమురురంగ ప్రభుత్వ సంస్థలను కోరతానన్నారు. ఒక్కరోజు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం ద్వారా పెట్రోలియం మంత్రిత్వశాఖ ఒక్కటే 40 వేల రూపాయల విలువైన 600 లీటర్ల పెట్రోలు, డీజిల్ ఆదా చేస్తుందని వీరప్ప మొయిలీ చెప్పారు.
ఇంధన పొదుపు ఆవశ్యకత సందేశాన్ని అందిచడం కోసం తాను వారానికి ఒక రోజు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వారం ప్రారంభించిన ఇంధన ఆదా ప్రచార ఉద్యమంలో భాగంగా పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉద్యోగులు వారానికి ఒకరోజు ప్రజా రవాణా వ్యవస్థను స్వచ్ఛందంగా ఉపయోగించాలని నిర్ణయించారు. కాగా, పెట్రోలియం శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కూడా బుధవారం మెట్రో రైలు, బస్సులలో ఆఫీసుకు చేరుకున్నట్లు తెలిసింది.
Advertisement