మెట్రోలో మహిళా దొంగలు
సాక్షి, న్యూఢిల్లీ :
సాధారణంగా మనం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో దొంగలు పట్టుబడుతుండటం సర్వసాధారణం. దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైళ్లలో కూడా దొంగలు గతం కంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగానే పట్టుబడుతున్నారు. విచిత్రమేమంటే... పట్టుబడిన వారిలో మహిళా దొంగలు ఎక్కువగా ఉండటం విశేషం.
తాజాగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) ఈ సంవత్సరం ఢిల్లీ మెట్రో రైళ్లలో 521 మంది జేబు దొంగలను పట్టుకుంది. అయితే వీరిలో 90 శాతం మంది మహిళలే. పైగా గత సంవత్సరంలో పట్టుబడిన జేబుదొంగలతో పోల్చితే ఈ ఏడాది పట్టుబడినవారి సంఖ్య మూడింతలుందని సీఐఎస్ఎఫ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఢిల్లీలోని ప్రతి రూట్లో యాంటీ థెఫ్ట్ స్క్వాడ్ జవాన్లను యూనిఫామ్‌లో, సివిల్ డ్రెస్ లో మోహరించినట్లు సీఐఎస్‌ఎఫ్ తెలిపింది.
ఈ జవాన్లు ప్రయాణీకుల జేబు కత్తిరించే జేబుదొంగలను అరెస్టు చేస్తున్నారని తెలిపింది. రద్దీగా ఉండే ఇంటర్‌చేంజ్ మెట్రో స్టేషన్లలో జేబుదొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజీవ్ చౌక్. సెంట్రల్ సెక్రటేరియట్, కశ్మీరీ గేట్, హుడా సిటీ సెంటర్, షహదరా స్టేషన్లలో జేబుదొంగలు ఎక్కువగా పట్టుబడ్డారు. పట్టుబడిన జేబు దొంగలలో 401 మంది మహిళలు కాగా, 120 మంది పురుషులున్నారు.