చేతి‘కంది’నా చేయూత కరువు
► కందుల ధర ఢమాల్
► క్వింటాలుకు రూ. 2 వేలకుపైనే తగ్గుదల
► రాష్ట్రానికి 45 వేల టన్నుల సేకరణకే కేంద్రం పరిమితి విధింపు
► 5 లక్షల టన్నుల దిగుబడి అంచనా
సాక్షి, హైదరాబాద్ : అష్టకష్టాలు పడి కంది పంటను కాపాడుకున్న రైతుకు పాడుకాలం దాపురించింది. కాలం కనికరించినా కేంద్రం కరుణించడంలేదు. చేతికందిన పంటకు చేయూత కరువైంది. ఒకవైపు ధర పడిపోయింది. మరోవైపు ఆదరవు లేకుండాపోయింది. కందుల ధర రాష్ట్ర మార్కెట్లో అమాంతం పడిపోయింది. గతేడాది క్వింటాలుకు రైతుల నుంచి రూ.7 వేల నుంచి రూ. 8 వేల వరకు కొనుగోలు చేయగా ఈసారి రూ. 5,050 మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి రావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తానని ప్రకటించింది. రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా కొనుగోలు ప్రక్రియపైనా కేంద్రం పరిమితి విధించింది. ఈ రెండు సంస్థలు కేవలం 45 వేల మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేయొద్దని ఆంక్షలు పెట్టింది. దీంతో మిగిలిన కందులను ఎక్కడ అమ్ముకోవాలో అర్థంగాక అన్నదాత అయోమయంలో ఉన్నాడు. వారం, పది రోజుల్లో మార్కెట్లోకి పెద్ద ఎత్తున కందులు రానున్నాయి.
ధర ఎక్కువని 4 లక్షల ఎకరాల్లో అదనపు సాగు
2015 ఖరీఫ్‌లో రాష్ట్రంలో కంది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అప్పట్లో కేవలం 5.62 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణంలో 81 శాతమే కందిని సాగు చేశారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు అప్పట్లో కరువు పరిస్థితులు కూడా కంది దిగుబడిని దెబ్బకొట్టాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించింది. దీంతో రాష్ట్రంలో 6.44 లక్షల ఎకరాల కంది సాధారణ సాగు విస్తీర్ణం ఏకంగా 10.30 లక్షలకు చేరింది. ఈ సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కూడా ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కంది విస్తీర్ణం, దిగుబడి తగ్గినప్పుడు మాత్రం మార్కెట్లో దాని ధర భారీగా ఉంది. ఇప్పుడు కాలం కలిసొచ్చి ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడేమో ధర పడిపోయింది. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
నోడల్ ఏజెన్సీలుగా మార్క్‌ఫెడ్, హాకా
రాష్ట్రంలో కనీస మద్దతు ధరకు కందులను సేకరించేందుకు మార్క్‌ఫెడ్, హాకాలను నోడల్ ఏజెన్సీలుగా నియమిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.