Pigeon pea
-
చిట్టి పావురాల్లో కృత్రిమమేధ..!
పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ.. శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు. సెలెక్టివ్ అటెన్షన్, స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిట్ట అని తేలింది. ఏఐ మోడల్‌ల్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. కృత్రిమ మేధతో పనిచేసే కంప్యూటర్, పావురం రెండూ కూడా ఒకే రకమైన పద్ధతిలో నేర్చుకుంటున్నాయని వాళ్ల పరిశీలనలో వెల్లడైంది. ఇందుకోసం వీళ్లు సుమారు 24 రకాల పావురాలను ఎంపికచేసి వాటికి రకరకాల ఆకారాలూ, వలయాల్లాంటి వాటిల్లోంచి వెళ్లి బటన్‌ను ప్రెస్ చేయడం... వంటి టాస్క్‌లను ఇచ్చారట. వాటికిచ్చిన పరీక్షలో విజయం సాధిస్తే బహుమతిగా ఆహారాన్ని అందించారు. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో రకరకాల పరీక్షలు నిర్వహించగా అవి చాలా త్వరగా ఆ పనులు నేర్చుకుని టార్గెట్‌ను చేరుకున్నాయి. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే.. అంతేకాదు, కొన్ని విషయాల్ని అవి మనిషికన్నా సమర్థంగా నేర్చుకోగలిగాయట. పైగా అవి నేర్చుకునే విధానం కూడా కృత్రిమ మేధను పోలి ఉందనీ, కాబట్టి పావురం న్యూరోబయాలజీని అధ్యయనం చేస్తే కృత్రిమమేధను మరింత సమర్థంగా అభివృద్ధి చేయగలమనీ చెబుతున్నారు. లెక్కించడం నుంచి రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం వరకూ పావురాలు అన్ని పనులూ చేయగలవని పరిశోధకులు తెలిపారు. -
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
నేటి నుంచి కంది కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోలు కేంద్రాలను బుధవారం నుంచి మూసేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. పూర్తిస్థాయిలో కందుల కొనుగోలు ప్రక్రియ ముగియలేదు. అనేక చోట్ల కందులను రైతులు మార్కెట్‌కు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలను మూసివేయడంపై విమర్శలు వస్తున్నా యి. మార్క్‌ఫెడ్ ఏర్పాటుచేసిన 93 కొనుగోలు కేంద్రాల్లో 40 కేంద్రాలను ఇటీవల మూసేశారు. మిగిలిన 53 కేంద్రాలను ఇప్పుడు మూసివేయ నున్నారు. హాకా ఆధ్వర్యంలో ప్రారంభమైన 48 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 44 కేంద్రాలను మూసేశారు. మరో నాలుగు కేంద్రాలను కూడా మూసివేసేందుకు హాకా నిర్ణయించింది. రాష్ట్రంలో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అవుతాయని అంచనా. మార్క్‌ఫెడ్ ద్వారా 1.08 లక్షల మెట్రిక్ టన్నులు, హాకా ద్వారా 1.18 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కేంద్రం మద్దతు ధర కింద 75,300 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తామని చెప్పడంతో, మిగిలిన కందులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఇది సర్కారుకు తలకు మించిన భారం కావడంతో మూసివేయాలని నిర్ణయించింది. -
ముగిసిన కందుల కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసే కార్యక్రమం బుధవారంతో ముగిసింది. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్ ధర రూ.9వేలకు పైగా ఉండగా ఈ ఏడాది మద్దతు కరువైంది. క్వింటా ధర రూ. 4000 కు పడిపోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్.. 80 రోజుల క్రితం జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి ఈ నెల 28వ తేదీతో ముగియగా.. దాదాపు 3 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అయితే 40 శాతం మంది రైతులు నగదు చెల్లించాల్సి ఉంది. -
వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాలకు డబ్బు
– కందుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మార్క్‌ఫెడ్ అధికారులు పత్తికొండ టౌన్: కందులు అమ్మిన వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మార్క్‌ఫెడ్ రాష్ట్ర డీఓ పవన్‌కుమార్, జిల్లా మేనేజర్ పరిమళజ్యోతి తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులోని కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కర్నూలులో 13, అనంతపురంలో 14, కృష్ణా జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి మూడు నెలలపాటు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.5,050కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కందుల ధర ఎట్టి పరిస్థితుల్లోనూ పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ సెక్రెటరీ రూప్‌కుమార్, కేడీసీఎంఎస్ మేనేజర్ మురళి, సిబ్బంది మల్లికార్జున, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కందుల కొనుగోలులో అంతులేని జాప్యం
– కర్నూలు, నందికొట్కూరులో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు –గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెడుతున్నా స్పందించని వైనం కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు కనికరించడం లేదు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మార్క్పెడ్ అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. జిల్లాల్లో కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇంతవరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించారు. నందికొట్కూరులో కేంద్ర ఏర్పాటు చేసినా కొనుగోలు మొదలుపెట్టలేదు. మిగతా చోట ఆ ఊసే లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు లేక కంది రైతులు మద్దతు ధరకు దూరమ వుతున్నారు. కందులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు బోనస్‌తో కలిపి రూ.5050 మద్దతు ధర ప్రకటించింది. అయితే, ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నాణ్యమైన కందులకు సైతం లభిస్తున్న ధరం రూ.4000 నుంచి రూ. 4100 మాత్రమే. అంటే మద్దతు ధరలో రైతులు రూ.950 నుంచి 1100 వరకు నష్టపోతున్నారు.దీంతో మార్క్పెడ్ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే రూ.5050 ధర లభిస్తుందని ఆశతో ఉన్నారు. 2015లో పండిన కందులు రైతుల దగ్గర, గోదాముల్లో భారీగా నిల్వఉన్నాయి. 2016లో కందిసాగు పెరిగినా దిగుబడులు రాలేదు. ఈ సమయంలో ధరలు పెరగాల్సి ఉన్నా 2015లో పండిన కందులు మార్కెట్లో భారీగా ఉండటంతో ధరలు పడిపోయాయి. రైతులు నష్టపోకుండా చూడాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం: పరిమళ, జిల్లా మేనేజర్ మార్క్పెడ్ కందులను మద్దతు ధర, బోనస్‌తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకు 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పటు చేయనున్నాం. ముందుగా కర్నూలు, నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాం. త్వరలోనే మిగిలిన చోట కేంద్రాలను ప్రారంభిస్తాం. -
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. మార్క్పెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మార్క్పెడ్ మద్దతు, బోనస్‌తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్క్పెడ్ జిల్లా మేనేజర్ పరిమల మాట్లాడుతూ... రైతులు కందులను తగిన నాణ్యతా ప్రమాణాలతో తీసుకవస్తే రూ.5050 ధర లభిస్తుందన్నారు. జిల్లాకు సంబంధించి త్వరలో మరో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి, మార్క్‌ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
చేతి‘కంది’నా చేయూత కరువు
► కందుల ధర ఢమాల్ ► క్వింటాలుకు రూ. 2 వేలకుపైనే తగ్గుదల ► రాష్ట్రానికి 45 వేల టన్నుల సేకరణకే కేంద్రం పరిమితి విధింపు ► 5 లక్షల టన్నుల దిగుబడి అంచనా సాక్షి, హైదరాబాద్ : అష్టకష్టాలు పడి కంది పంటను కాపాడుకున్న రైతుకు పాడుకాలం దాపురించింది. కాలం కనికరించినా కేంద్రం కరుణించడంలేదు. చేతికందిన పంటకు చేయూత కరువైంది. ఒకవైపు ధర పడిపోయింది. మరోవైపు ఆదరవు లేకుండాపోయింది. కందుల ధర రాష్ట్ర మార్కెట్లో అమాంతం పడిపోయింది. గతేడాది క్వింటాలుకు రైతుల నుంచి రూ.7 వేల నుంచి రూ. 8 వేల వరకు కొనుగోలు చేయగా ఈసారి రూ. 5,050 మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి రావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తానని ప్రకటించింది. రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా కొనుగోలు ప్రక్రియపైనా కేంద్రం పరిమితి విధించింది. ఈ రెండు సంస్థలు కేవలం 45 వేల మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేయొద్దని ఆంక్షలు పెట్టింది. దీంతో మిగిలిన కందులను ఎక్కడ అమ్ముకోవాలో అర్థంగాక అన్నదాత అయోమయంలో ఉన్నాడు. వారం, పది రోజుల్లో మార్కెట్లోకి పెద్ద ఎత్తున కందులు రానున్నాయి. ధర ఎక్కువని 4 లక్షల ఎకరాల్లో అదనపు సాగు 2015 ఖరీఫ్‌లో రాష్ట్రంలో కంది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అప్పట్లో కేవలం 5.62 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణంలో 81 శాతమే కందిని సాగు చేశారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు అప్పట్లో కరువు పరిస్థితులు కూడా కంది దిగుబడిని దెబ్బకొట్టాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించింది. దీంతో రాష్ట్రంలో 6.44 లక్షల ఎకరాల కంది సాధారణ సాగు విస్తీర్ణం ఏకంగా 10.30 లక్షలకు చేరింది. ఈ సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కూడా ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కంది విస్తీర్ణం, దిగుబడి తగ్గినప్పుడు మాత్రం మార్కెట్లో దాని ధర భారీగా ఉంది. ఇప్పుడు కాలం కలిసొచ్చి ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడేమో ధర పడిపోయింది. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. నోడల్ ఏజెన్సీలుగా మార్క్‌ఫెడ్, హాకా రాష్ట్రంలో కనీస మద్దతు ధరకు కందులను సేకరించేందుకు మార్క్‌ఫెడ్, హాకాలను నోడల్ ఏజెన్సీలుగా నియమిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మక్క సాగు భలే బాగు
బయ్యారం: వరికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటల్లో మొక్కజొన్న మొదటిది. రబీలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం... అనువైన నేలలు: మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర, ఒండ్రు మట్టి ఉన్న ఇసుక, గరపనేలలు అనుకూలం. దుక్కి తయారీ: నాగలితో నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో మాగిన పశువుల ఎరువు కాని కంపోస్టు ఎరువు కాని వేసి దున్నాలి. ఆ తరువాత విత్తనాలను బోదె పద్ధతి, నాగలి సాళ్ళలో తగినంత తేమను చూసుకొని విత్తాలి. విత్తే కాలం: రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తాలి. విత్తన మోతాదు: ఎకరానికి ఏడు కిలోల విత్తనాలను విత్తుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 33 వేల మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ, సాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ ఎడం ఉండేలా, బోదెకు ఒకవైపున 2 లేదా 3 సెం.మీ లోతులో విత్తాలి. పాదుకు 2 లేదా 3 మొక్కలను నాటాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత పాదుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందును 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అంతరపంటలు: మొక్కజొన్నలో అంతరపంటగా కంది, అలసంద, పెసర, సోయాచిక్కుడు వంటి అపరాల పంటలను వేసుకోవచ్చు. 4 లేక 5 సాళ్లు మొక్కజొన్న వేసి ఆ తర్వాత ఒక సాలు పప్పుపంట వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్నకు సహజ శత్రువులైన పరాన్నజీవులు, పరాన్నభుక్తుల సంఖ్యను పెంచుకోవటమే గాక అధిక దిగుబడి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయ పంటలు ముల్లంగి, ఆకుకూరలను వేసుకొని కూడా అధికాదాయం పొందవచ్చు. ఎరువులు మొక్కజొన్న సాగుకు రెండు కట్టల యూరియా, కట్టన్నర డీఏపీ, కట్ట పొటాష్ అవసరం. డీఏపీతో పాటు కట్ట పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియాను నాలుగు దఫాలుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. భూమిలో జింకు లోపముంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఏ ఎరువులో కలపకుండా విడిగా వేయాలి. కలుపునివారణ: మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే విత్తిన 45-50 రోజుల వ్యవధిలో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలి. విత్తనాలు విత్తిన మూడు రోజుల వ్యవధిలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి కిలో అట్రాజిన్ మందును 500 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. అంతరకృషి: విత్తిన 30రోజులకోసారి, 45- 50 రోజులకు మరో సారి గొర్రుతో గాని, నాగలితో గాని సాళ్ళ మధ్య దున్నాలి. ఈ విధంగా దున్నటం వల్ల కలుపును నివారించటంతో పాటు మొక్కలకు తేమ, గాలి సక్రమంగా అందుతుంది. పంట ఏపుగా పెరుగుతుంది. తడులు: పంట మొలకెత్తిన నెలరోజుల వరకు (పంట మోకాలు ఎత్తుకు వచ్చేంత వరకు) అవసరాన్ని బట్టి, భూమి స్వభావాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. ఈ దశలో నీటితేమ అధికంగా ఉంటే పంట ఎదుగుల తగ్గే అవకాశం ఉంది. సస్యరక్షణ చర్యలు మొక్కజొన్నలో అశించే పలు రకాల పురుగులు, తెగుళ్ళను రైతులు సరైన సమయంలో గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండంతొలిచే పురుగు: మొక్కజొన్న మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల లోపు పైరును ఇది ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్లలో ఉన్న పురుగులు 5 రోజుల వ్యవధిలో బయటకు వస్తాయి. మొక్కజొన్న అంకురంలోకి చేరి ఎదిగే అంకురాన్ని తింటాయి. ఈ పురుగుల వల్ల మొవ్వు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి 3 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఆకు సుడులలో వేయాలి. లేదా లీటర్ నీటిలో 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 0.3 మి.లీ కొరోజాన్ మందును పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు: నెలరోజులు పైబడిన పంటను మొక్కజొన్న నల్లి, పేనుబంక ఆశిస్తాయి. వీటి తల్లిపురుగులు, పిల్లపురుగులు పంటలో ఎదిగే భాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి గిడసబారుతాయి. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 1 గ్రా ఎఫిసేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు: అకుమాడు తెగులు నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు పర్యాయాలు పిచికారీ చేయాలి. మొక్క ఎండు తెగులు: ఈ తెగులు నివారణకు 1 మి.లీ ప్రాఫికొనజోల్ మందును లీటర్‌నీటిలో కలిపి పిచికారీ చేయాలి.