సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది.
కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్‌ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది.
నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..?
రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు.
పావురాల విసర్జితాలతో హాని ఇలా..
పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ వాస్తవాలు..
► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు.
► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది.
► భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య)
Comments
Please login to add a commentAdd a comment