కందుల కొనుగోలులో అంతులేని జాప్యం
Published Sun, Jan 15 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
– కర్నూలు, నందికొట్కూరులో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
–గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెడుతున్నా స్పందించని వైనం
కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు కనికరించడం లేదు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మార్క్‌పెడ్ అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. జిల్లాల్లో కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇంతవరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించారు. నందికొట్కూరులో కేంద్ర ఏర్పాటు చేసినా కొనుగోలు మొదలుపెట్టలేదు. మిగతా చోట ఆ ఊసే లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు లేక కంది రైతులు మద్దతు ధరకు దూరమ వుతున్నారు. కందులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు బోనస్‌తో కలిపి రూ.5050 మద్దతు ధర ప్రకటించింది. అయితే, ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో నాణ్యమైన కందులకు సైతం లభిస్తున్న ధరం రూ.4000 నుంచి రూ. 4100 మాత్రమే. అంటే మద్దతు ధరలో రైతులు రూ.950 నుంచి 1100 వరకు నష్టపోతున్నారు.దీంతో మార్క్‌పెడ్ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే రూ.5050 ధర లభిస్తుందని ఆశతో ఉన్నారు. 2015లో పండిన కందులు రైతుల దగ్గర, గోదాముల్లో భారీగా నిల్వఉన్నాయి. 2016లో కందిసాగు పెరిగినా దిగుబడులు రాలేదు. ఈ సమయంలో ధరలు పెరగాల్సి ఉన్నా 2015లో పండిన కందులు మార్కెట్‌లో భారీగా ఉండటంతో ధరలు పడిపోయాయి. రైతులు నష్టపోకుండా చూడాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం: పరిమళ, జిల్లా మేనేజర్ మార్క్‌పెడ్
కందులను మద్దతు ధర, బోనస్‌తో కలిపి రూ.5050 ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకు 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పటు చేయనున్నాం. ముందుగా కర్నూలు, నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాం. త్వరలోనే మిగిలిన చోట కేంద్రాలను ప్రారంభిస్తాం.
Advertisement