దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం ఆవిష్కరణ
కోయంబత్తూరు: దేశంలో అతిపెద్ద శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మోదీ ఈ విగ్రహాన్ని, ఆదియోగి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతర ప్రముఖులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు 8 నెలల సమయం పట్టిందని వాసుదేవ్ చెప్పారు. అంతకుముందు కోయంబత్తూరు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి పళనిస్వామి స్వాగతం పలికారు.