ప్రయాణికుడిని దోచుకున్న పోలీసులు
చెన్నై: దొంగలను పోలీసులు పట్టుకుంటారు. మరి పోలీసులే దొంగలైతే వారిని ఎవరు పట్టుకుంటారు..?. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఇదే ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడిని దోచుకున్న ముగ్గురు పోలీసులు కటకటాల పాలయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. దక్షిణ రైల్వే పరిధిలో చెన్నై సెంట్రల్ స్టేషన్ ఎంతో ప్రధానమైనది. రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున ఈ స్టేషన్ 24 గంటలూ కిటకిటలాడుతూ ఉంటుంది. దీంతో గవర్నమెంటు రైల్వేపోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు నిఘా ఉంటుంది. వీరితోపాటూ తమిళనాడు ప్రత్యేక పోలీసు దళం కూడా బందోబస్తు చేపడుతుంది.
మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు తన సొమ్ము కాజేశారంటూ ఒడిశాకు చెందిన బిజేంద్రరెడ్డి (23) అనే ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 15 ఏళ్లుగా చెన్నై తిరువాన్మీయూరులోని ఒక భవన నిర్మాణ సంస్థలో రోజుకు రూ.300 వేతనంపై రోజుకూలీగా పనిచేస్తున్నాడు. కేరళలో రోజుకు రూ.500లు ఇస్తున్నట్లు స్నేహితుని ద్వారా తెలుసుకుని ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు సెంట్రల్‌కు వచ్చాడు. అతను రావడం ఆలస్యం కావడంతో రైలు వెళ్లిపోయింది.
మరో రైలు కోసం స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో కాచుకుని ఉండగా యూనిఫాంతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ‘నీపై సందేహంగా ఉంది, తనిఖీ చేయాలి రా..’ అంటూ మూర్‌మార్కెట్‌కు అనుకుని ఉండే ప్లాట్‌ఫారంపైకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి రిస్ట్‌వాచ్, రూ.1500 నగదు లాక్కున్నారు. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు పిలిచి విచారించగా, అనుమానంతో తనిఖీ మాత్రమే చేశాం, అతడిని కొట్టలేదు, సొమ్ము లాక్కోలేదని బుకాయించారు.
వారి మాటలపై సందేహించిన అధికారులు ఫ్లాట్‌ఫారంపై ఉన్న సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ ముగ్గురే నిందితులను నిర్దారించుకున్నారు. తమిళనాడు ప్రత్యేక సాయుధదళం 13వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణన్, రాజ్, అరుళ్‌దాస్‌గా గుర్తించారు. మూడు నెలల పాటూ జామీనులో బయటకు రాలేని సెక్షన్లపై ముగ్గురిపై కేసులు పెట్టి మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.