= సర్కారీ పాఠశాలల్లో కొరవడిన విద్యా ప్రమాణాలు
= కేఎస్‌క్యూఏఏసీ సర్వేలో బట్టబయలు
= అట్టడుగు స్థానంలో బీదర్ జిల్లా
= వేధిస్తున్న సదుపాయాల కొరత
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతతో పాటు విద్యా ప్రమాణాలు కూడా తక్కువ గానే ఉంటున్నాయని మరోసారి తేటతెల్లమైంది. కర్ణాటక స్టేట్ క్వాలిటీ అసిస్‌మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ (కేఎస్‌క్యూఏఏసీ) ఇటీవల జరిపిన సర్వేలో విద్యలో నాణ్యత విషయమై రాష్ట్రంలోని ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా అత్యున్నత స్థాయిని అందులోలేకపోయింది.
ఇందుకు మౌలిక సదుపాయాల కొరతతో పాటు స్థానిక సంస్థల సహకారం కొరవడటం ప్రధాన కారణాలుగా విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. నేషనల్ అసిస్‌మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ (ఎన్‌ఏఏసీ) సూచనల మేరకు ‘కేఎస్‌క్యూఏఏసీ’ రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లోని విద్యా నాణ్యతపై నివేదిక తయారు చేసి ఇటీవలే ప్రభుత్వానికి అందించింది. 2012 జులై నుంచి ఈ ఏడాది మే వరకూ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత విషయమై ‘కేఎస్‌క్యూఏఏసీ’ నివేదిక తయారు చేసింది.
ఈ విధమైన నివేదిక తయారు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ నివేదికలో ఉన్న విషయాలను అనుసరించి... రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 60 వేల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. పెలైట్ ప్రాజెక్టులో భాగంగా 1,020 పాఠశాలలను ర్యాండమ్ విధానంలో కేఎస్‌క్యూఏఏసీ అధికారులు ఎంపిక చేసుకున్నారు. రాష్ట్రంలోని 175 తాలూకాల్లో ప్రతి తాలూకాకు మూడు ప్రాథమిక, రెండు మాధ్యమిక పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. ఇందులో విద్యా నాణ్యతను పరిశీలించడానికి ఐదు అంశాలను ఎంపిక చేసి మొత్తం 100 మార్కులు కేటాయించారు.
ఇందులో భవనాలు, గ్రంథాలయాలు, ఆటస్థలం, తాగునీరు, శౌచాలయాలు, పాఠశాల పరిసరాల స్వచ్ఛత తదితర మౌలిక సదుపాయాలకు 20 మార్కులు, విద్యార్థుల అభ్యసన సాధనకు (లర్నింగ్ అచీవ్‌మెంట్స్) 60 మార్కులు, ఉపాధ్యాయుల నాయకత్వ లక్షణాలకు 10 మార్కులు, పాఠశాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు, సంస్థల సహకారానికి (కమ్యూనిటీ పార్టిసిపేషన్) 5 మార్కులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వినూత్న పద్దతుల ఆచరణకు సంబంధించి 5 మార్కులను కేటాయించారు. కాగా కేఎస్‌క్యూఏఏసీ ఎంపిక చేసుకున్న 1,020 పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాల కూడా 90 నుంచి 100 మధ్య మార్కులను పొంది ఏ ప్లస్ గ్రేడ్‌ను దక్కించుకోలేదు.
అంటే రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలలో కూడా అత్యున్నత విద్యా ప్రమాణాలు లేవని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. అదే విధంగా విద్యా ప్రమాణాల విషయమై చివరి స్థానాలైన సీ, డీ గ్రేడ్‌లలోనే సగానికి సగం పాఠశాలలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నాణ్యత ఎంతమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చునని విద్యా రంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కేఎస్‌క్యూఏఏసీ ఎంపిక చేసిన ఐదు ఏ గ్రేడ్ పాఠశాలల్లో 4 చిక్కోడి తాలూకాకు చెందినవి. కాగా, అట్టడుగు స్థానం బీదర్ జిల్లాకు దక్కింది. ఈ జిల్లాలో డీ గ్రేడ్‌లో 22 పాఠశాలలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.
చదువులు చట్టుబండలు
Published Mon, Nov 25 2013 2:30 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement
Advertisement