ఎంపీ X పోలీస్‌ | Sakshi
Sakshi News home page

ఎంపీ X పోలీస్‌

Published Mon, Dec 4 2017 9:08 AM

Pratap Simha among several arrested in Hunsur ahead of Hanuma Jayanthi - Sakshi

మైసూరు: హనుమజ్జయంతి వేడుకలు మైసూరు జిల్లా హుణుసూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆదివారం హనుమజ్జయంతి మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఆరంభమైన ఊరేగింపు తోపులాట, లాఠీ చార్జ్, రాళ్లదాడులు, అరెస్టులతో భీతావహ వాతావరణం నెలకొంది. వివరాలు.. హనుమజయంతి సందర్భంగా ఊరేగింపునకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. దీంతో ఆదివారం పట్టణంలోని మునేశ్వర కావల్‌ మైదానం నుంచి హనుమ జయంతి సమితి సభ్యులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఊరేగింపును ప్రారంభించారు. అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఊరేగింపును చేయనున్నట్లు తెలిసి జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్‌ సిబ్బందితో కలసి సమితి సభ్యులను, హిందూ సంఘాల కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్‌ చేసి కే.ఆర్‌.నగర వాల్మీకి సముదాయ భవనానికి తరలించారు. 

ఎంపీ వస్తేనే ఊరేగింపు అని దీక్ష  : ఇదే సమయంలో హనుమాన్‌ ఊరేగింపులో పాల్గొనడానికి మైసూరు నుంచి వస్తున్న బీజేపీ ఎంపీ ప్రతాప సింహాను పట్టణంలోని డీ.దేవరాజు అరసు విగ్రహం వద్ద అరెస్ట్‌ చేసి హెచ్‌.డీ.కోట తాలూకాలోని అంతరసంతకు తరలించారు. విషయం తెలుసుకున్న గురుజంగమ మఠాధీశుడు నటరాజస్వామి నేతృత్వంలో వందలాది మంది హనుమ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు, మాజీ మంత్రి విశ్వనాథ్, ముడా మాజీ అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు. వారు లేకుండా ఊరేగింపు సాగదని తేల్చిచెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఊరేగింపును రద్దు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో హిందూ సంఘాల కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం ప్రారంభించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు హఠాత్తుగా లాఠీఛార్జ్‌ చేశారు. దీనికి ప్రతిగా నిరసనకారులు పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను రప్పించగా, హుణుసూరులో పరిస్థితి ఉద్విగ్నంగా మారాయి. పోలీసుల లాఠీచార్జ్, నిరసనకారుల రాళ్ల దాడిలో ఇరువర్గాలకూ గాయాలయ్యాయి. 

నేడు సోమవారం హుణుసూరు బంద్‌
హుణుసూరులో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మిర్లే శ్రీనివాస్‌గౌడ మాట్లాడుతూ..సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకంగా విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇతర మతాలకు ఊరేగింపు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చి హిందువుల పండుగలకు మాత్రం ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా సోమవారం హుణుసూరు పట్టణం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.   

ఎంపీ ప్రతాపసింహా వీరావేశం 
ఊరేగింపులో పాల్గొనడానికి హనుమ మాలను ధరించి మైసూరు నుంచి వస్తున్న ఎంపీ ప్రతాపసింహాను అడ్డుకోవడానికి పోలీసులు బిళికెరె గ్రామం వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆవేశం చెందిన ఎంపీ ప్రతాపసింహా తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా వెనక్కి తగ్గకపోవడంతో మరింత ఆక్రోశం చెందిన ఎంపీ ప్రతాపసింహా ఎలా ఆపుతారో చూస్తానంటూ కారును వేగంగా నడుపుతూ బ్యారికేడ్లను గుద్దుకుంటూ దూసుకెళ్లారు. అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఎంపీ అదే వేగంతో దూసుకు రాగా, ఆమె పక్కకు దూకేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హుణుసూరు డీఎస్పీ మరో 50 మంది సిబ్బందితో కలసి హుణుసూరు పట్టణ శివార్లలో ఎంపీ ప్రతాపసింహాను అడ్డుకొని అంతరసంతకు తరలించారు. బారికేడ్లను ఢీకొట్టడం, మహిళా పోలీసు అధికారి గాయమవడానికి కారణమయ్యారంటూ ఎంపీపై బిళికెరె పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement