చెన్నై : తమిళనాడులోని తిరువూర్ జిల్లాలో సహజ సిద్దమైన ప్రకృతి వైద్యంపై నమ్మకం ఓ కుటుంబంలో విషాదం నింపింది. యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి.. స్నేహితురాలి సాయంతో బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నించిన ఓ మహిళ అధిక రక్తస్రావం కావడంతో మరణించారు. ఈ నెల 22 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పుదుపాలయంకు చెందిన కార్తికేయన్ భార్య కీర్తిక అదే ప్రాంతంలోని ఓ ప్రవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి హిమాని అనే కూతురు ఉంది. వీరి పక్కనే నివసిస్తున్న లావణ్య, ప్రవీణ్‌ల జంటతో వీరు స్నేహంగా ఉండేవారు. ఇటీవలే లావణ్యకు ఇంట్లోనే సుఖ ప్రసవంలో పాప పుట్టింది. తొలి నుంచి కీర్తికకు పకృతి వైద్యంపైనా నమ్మకం ఎక్కువగా ఉండేది. దీంతో మరోమారు గర్భం దాల్చిన కీర్తిక తన బిడ్డకు సహజంగానే జన్మనివ్వాలని భావించారు. సహజ ప్రసవం కోసం తన భర్తను ఒప్పించారు.
ఇందు కోసం కీర్తిక యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూశారు. ఆదివారం కీర్తికకు పురిటి నొప్పులు రావడంతో.. లావణ్యకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని యూట్యూబ్ వీడియోల్లో మాదిరి సహజ ప్రసవానికి ప్రయత్నించారు. పుట్టిన బిడ్డ సురక్షితంగా ఉన్నప్పటికీ.. ఈ ప్రయత్నంలో తీవ్ర రక్తప్రావం కావడంతో కీర్తిక ప్రాణాలు కొల్పోయింది. ఆమె మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లగా.. డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో అక్కడి సిబ్బంది దహనానికి అంగీకరించలేదు. శశ్మాన సిబ్బంది సమాచారంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పంచనామా అనంతరం కీర్తిక మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీర్తిక భర్తతో పాటు లావణ్య దంపతులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ అవగాహన లేకుంగా సహజసిద్ద వైద్యాలు చేసుకోవద్దని ప్రజలను హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment