naturopathy
-
'వాటిని వైద్య కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలి'
ఢిల్లీ : ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం భారతీయ వైద్య విధాన కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్ బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేద, యునాని, సిద్ధ, సోవా రిగ్పాను నియంత్రిస్తూ ఆయా రంగాలలో పారదర్శకత, బాధ్యతను కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన సంస్కరణల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతీయ వైద్య విధానాలలో విద్య, వృత్తి నియంత్రణ కోసం యోగా, నేచురోపతిని కూడా తప్పనిసరిగా వైద్య కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే బిల్లులోని సెక్షన్33లో పొందుపరచిన ఒక నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ నిబంధన కారణంగా భారతీయ వైద్య విధానాలు ప్రాక్టీస్ చేసే అర్హులైన వైద్యులకు అన్యాయం జరుగుతుంది.ఈ నిబంధన కారణంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉత్తీర్ణులు కాని కొందరు కమిషన్ అనుమతితో ప్రాక్టీసు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఫలితంగా నకిలీ వైద్యుల బెడదను అరికట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు లక్ష్యం నిర్వీర్యమవుతుందని తెలిపారు. ఓబీసీల సబ్‌కేటగిరీపై కమిషన్ గడువు పెంపు : ఓబీసీల సబ్‌కేటగిరీపై కమిషన్ గడువు పెంపుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలను సబ్ కేటగిరిగా విభజించాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. రిజర్వేషన్ ఫలాలు ఓబీసీలకు సమాన నిష్పత్తిలో అందడం లేదన్న ఫిర్యాదులపై ఎలాంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించలేదని మంత్రి తెలిపారు. అయితే ఓబీసీలను సబ్ కేటగిరీల కింద విభజించాలంటూ వచ్చిన డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్340 కింద కల్పించిన అధికారాన్ని వినియోగించి 2017 అక్టోబర్2న కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియంమించిదన్నారు. ఈ కమిషన్ గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ రావడం జరిగింది. తాజాగా కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31కి పొడిగిస్తూ గత జనవరి 17న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి వివరించారు. -
యూట్యూబ్ వీడియోలు ; నిండు ప్రాణం బలి
-
యూట్యూబ్ వీడియోలు ; నిండు ప్రాణం బలి
చెన్నై : తమిళనాడులోని తిరువూర్ జిల్లాలో సహజ సిద్దమైన ప్రకృతి వైద్యంపై నమ్మకం ఓ కుటుంబంలో విషాదం నింపింది. యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి.. స్నేహితురాలి సాయంతో బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నించిన ఓ మహిళ అధిక రక్తస్రావం కావడంతో మరణించారు. ఈ నెల 22 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పుదుపాలయంకు చెందిన కార్తికేయన్ భార్య కీర్తిక అదే ప్రాంతంలోని ఓ ప్రవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి హిమాని అనే కూతురు ఉంది. వీరి పక్కనే నివసిస్తున్న లావణ్య, ప్రవీణ్‌ల జంటతో వీరు స్నేహంగా ఉండేవారు. ఇటీవలే లావణ్యకు ఇంట్లోనే సుఖ ప్రసవంలో పాప పుట్టింది. తొలి నుంచి కీర్తికకు పకృతి వైద్యంపైనా నమ్మకం ఎక్కువగా ఉండేది. దీంతో మరోమారు గర్భం దాల్చిన కీర్తిక తన బిడ్డకు సహజంగానే జన్మనివ్వాలని భావించారు. సహజ ప్రసవం కోసం తన భర్తను ఒప్పించారు. ఇందు కోసం కీర్తిక యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూశారు. ఆదివారం కీర్తికకు పురిటి నొప్పులు రావడంతో.. లావణ్యకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని యూట్యూబ్ వీడియోల్లో మాదిరి సహజ ప్రసవానికి ప్రయత్నించారు. పుట్టిన బిడ్డ సురక్షితంగా ఉన్నప్పటికీ.. ఈ ప్రయత్నంలో తీవ్ర రక్తప్రావం కావడంతో కీర్తిక ప్రాణాలు కొల్పోయింది. ఆమె మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లగా.. డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో అక్కడి సిబ్బంది దహనానికి అంగీకరించలేదు. శశ్మాన సిబ్బంది సమాచారంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పంచనామా అనంతరం కీర్తిక మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీర్తిక భర్తతో పాటు లావణ్య దంపతులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ అవగాహన లేకుంగా సహజసిద్ద వైద్యాలు చేసుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. -
ప్రకృతి వైద్యం.. పేదలకు దూరం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థలందించే ప్రకృతి వైద్యం ఇప్పటికే సామాన్యులకు అందకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం సైతం ఇదే దారిలో పయనిస్తోంది. ప్రకృతి వైద్యశాలలో యూజర్ చార్జీలు పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. యోగధ్యాన పరిషత్ పరిధిలోని ప్రకృతి వైద్యశాలలో అందించే అన్ని రకాల యోగా, ఆయుర్వేద చికిత్సలకు యూజర్ చార్జీలను పెంచింది. మొత్తం 32 రకాల సేవల చార్జీలను పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. యోగధ్యాన పరిషత్ పరిధిలో ఉండే ఈ ప్రకృతి వైద్యశాలను 1949లో హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రభుత్వ పరిధిలోని ఏకైక ప్రకృతి వైద్యశాల కావడంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రకృతి వైద్యానికి ఆదరణ కూడా బాగా పెరుగుతోంది. బరువు తగ్గడం, ఆస్తమా, చర్మ రోగాలు, స్పాండిలైటిస్, నరాల వ్యాధుల చికిత్సలకు ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. వ్యసనాలను మానేందుకు అధిక శాతం దీన్నే ఆశ్రయిస్తున్నారు. 200 పడకలుండే ఈ వైద్యశాలలో ఏటా 40 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూజర్ చార్జీలను పెంచాలని యోగధ్యాన పరిషత్ ప్రతిపాదనలు పంపింది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’
► 9 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న మహిళా రైతు మల్లీశ్వరి ► జీవామృతం, గో మూత్రం అందిస్తూ అరటి, చెరకు, పసుపు, మినుము పంటల సాగులో మంచి దిగుబడులు ► చీడపీడలు, తెగుళ్ల బెడద లేకుండా రుచికరమైన, నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు కృష్ణా తీరంలో సారవంతమైన భూముల్లో ప్రకృతి వ్యవసాయం ఫలప్రదమవుతోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. పాలేకర్ పద్ధతిలో సేద్యం చేస్తూ నాణ్యమైన పంటలను పండిస్తున్నారు. 9 ఏళ్ల క్రితం నుంచే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొద్ది మంది తొలి తరం ప్రకృతి వ్యవసాయదారుల్లో అన్నపురెడ్డి మల్లీశ్వరి ఒకరు. తన భర్త సంజీవరెడ్డితో కలిసి రోజుకు పది గంటల పాటు పొలంలో శ్రమిస్తూ ఆదర్శప్రాయంగా ప్రకృతిసేద్యం చేస్తూ.. సత్ఫలితాలు పొందుతున్నారు. ‘2008లో విజయవాడ పోరంకిలో సుభాష్ పాలేకర్ మీటింగ్‌కు మొదటిసారి వెళ్లాం. ప్రకృతి సేద్యం గురించి పాలేకర్ చాలా సంగతులు చెప్పారు. 2010లో పాలేకర్ గుంటూరు వచ్చినపుడు కూడా వెళ్లాను. రసాయనాలు, క్రిమిసంహారక మందులతో నేల ఎంత నిస్సారమవుతున్నదో పూసగుచ్చినట్టు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ‘నేలను నమ్ముకుని బతికేవాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం?’ అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాం... వెంటనే ఒక ఆవును కొని, మొదలుపెట్టాం’ అని మల్లీశ్వరి గుర్తుచేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ఆమె స్వగ్రామం. తొలినాళ్లలో ఘన జీవామృతం, జీవామృతం, వివిధ రకాల కషాయాలు వాడారు. నాలుగేళ్ల క్రితం నుంచి కేవలం గోమూత్రం, జీవామృతం తోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. 20 రోజులకోసారి జీవామృతం.. 10 రోజులకోసారి గోమూత్రం.. ఆరు ఎకరాల నల్లరేగడి భూమిలో అరటితోపాటు చెరకు, పసుపు పంటలను మల్లీశ్వరి సాగు చేస్తున్నారు. బోరు నీళ్లను డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తున్నారు. పంట ఏదైనా వారు అనుసరించే సాగు విధానం మాత్రం ఒక్కటే. ముందుగా దుక్కిలో ఎకరాకు 2 ట్రక్కుల కోళ్ల ఎరువు వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 20 రోజులకోసారి.. 10 రోజులకోసారి గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తారు. కలుపు నివారణకు, భూసారం పెంపొందించడానికి గడ్డీ గాదం, పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. రెండు ఆవులను పెంచుతున్నారు. ఆవుల పాకలో గోమూత్రం నిల్వ చేసేందుకు గుంత తవ్వి 3 సిమెంట్ వరలు ఏర్పాటు చేశారు. దాని అడుగున గులకరాళ్లు, బేబీ చిప్స్, ఇసుక మిశ్రమాన్ని వేశారు. ఈ గుంతలోకి 10 రోజులకోసారి 30 లీటర్ల గోమూత్రం చేరుతుంది. ఈ మూత్రాన్ని బకెట్లతో సేకరించి వడకట్టి, డ్రిప్ ట్యాంకులో పోసి, పంటలకు అందిస్తారు. 20 అడుగులు పెరిగిన అరటి చెట్లు.. 2008లో తొలిసారిగా అరటిని ప్రకృతిసేద్య పద్ధతిలో సాగు చేశారు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటారు. జనవరి–ఫిబ్రవరి మాసాల్లో కోతలయ్యాయి. చక్కెరకేళి రకంలో గెలకు 70 కాయలు.. కర్పూర అరటి చెట్లు దాదాపు 20 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గెలకు 200 కాయలతో ఒక్కో గెల 45 కిలోల వరకూ బరువు తూగుతోంది. రసాయన ఎరువులతో సాగు చేసిన అరటి కాయల కన్నా.. ఇవి అధికంగా పొడవు పెరిగి, మంచి రంగుతో ఆకర్షణీయంగా, రుచిగా ఉన్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. దీంతో వ్యాపారస్తులు ఈ అరటికాయలపై ఆసక్తి చూపుతున్నారు. వీరి పసుపు పొలంలో పుచ్చు సమస్య లేదు. దుంప బాగా ఊరి ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకటిన్నర ఎకరాలో చెరకును సాగు చేస్తున్నారు. గత రబీలో మల్లీశ్వరి ఎకరాకు 5 క్వింటాళ్ల మినుము దిగుబడి సాధించి.. ఔరా అనిపించారు. ఇంతకంటే భరోసా ఏముంటుంది? ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గాయి. తోటి రైతులు ఎకరా భూమిలో సేద్యానికి ఏటా 10 పిండి కట్టలు (డీఏపీ, యూరియా, పొటాష్..) వేస్తున్నారు. సగటున ఒక పంటకు ఎకరాకు రూ.7–8 వేలు ఖర్చవుతోంది. పురుగుమందుల ఖర్చు అదనం. ఈ ఖర్చులు లేకుండానే ప్రకృతి సేద్యం చేస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం సొంతంగా తయారుచేసుకోవటానికి కాస్త శ్రమ పడుతున్నప్పటికీ.. సంతృప్తి ఉంది. పండ్లు నాణ్యంగా, రుచికరంగా ఉంటున్నాయి. మంచి ధర పలుకుతోంది. ఆరోగ్యానికి, ఆదాయానికీ ఇంతకంటే భరోసా ఏముంటుంది? నాకు మందుబిళ్లలతో అవసరమే రాలేదంటే ప్రకృతి ఆహారాన్ని తినటమే కారణం. – అన్నపురెడ్డి మల్లీశ్వరి, మహిళా రైతు, నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ నిలకడగా పంట దిగుబడులు! మల్లీశ్వరి రోజుకు 10 గంటలు పొలంలోనే ఉండి అన్ని పనులూ స్వయంగా చూసుకుంటుంది. 9 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందువల్ల మా భూమి బాగుపడింది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పంట దిగుబడులు నిలకడగా వస్తున్నాయి. పంట నాణ్యత బావుంది. సాగు ఖర్చులు బాగా తగ్గాయి. మమ్మల్ని చూసి మా ఊళ్లో కొంతమంది రైతులు ప్రకృతి సేద్యంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. – అన్నపురెడ్డి సంజీవరెడ్డి (99510 60379), నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
ప్రకృతి సేద్యం – విత్తనోత్పత్తిపై రైతులకు నెల రోజుల ఉచిత శిక్షణ
ప్రకృతి వ్యవసాయం, విత్తనోత్పత్తిపై రైతులకు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వాలని శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు నిర్ణయించింది. 240 గంటల పాటు (నెలకు పైగా) శిక్షణ ఉంటుంది. వసతి, భోజనం ఉచితం. శిక్షణకు రానుపోను ప్రయాణ ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. శిక్షణ ఆంగ్లంలో ఉంటుంది. ఇతర వివరాలకు.. 080– 28432965 నంబరులో లేదా training.ssiast@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. -
జూలై 2న కొర్నెపాడులో మిరప, వరి ప్రకృతి సేద్యంపై సదస్సు
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో జూలై 2న ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణా శిబిరం జరుగుతుంది. మిరప, వరి సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు లావణ్య, ధర్మారం బాజి, డా.కొసరాజు చంద్రశేఖరరావు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల రైతులు పేర్ల నమోదుకు 0863–2286255, 97053 83666ను సంప్రదించవచ్చు. -
పూర్తి ఆరోగ్యంతో ఉన్నా: కేజ్రీవాల్
బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నూతనోత్సాహంతో హస్తిన చేరుకున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు శివార్లలోని జిందాల్ ప్రకృతి చికిత్సా సంస్థలో ఈ నెల 5న తల్లిదండ్రులతో కలసి చేరిన చికిత్స పూర్తికావడంతో సోమవారం ఢిల్లీకి వచ్చారు. తానిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్నారు. మరోపక్క.. కేజ్రీవాల్‌పై నిరాధార ఆరోపణలకుగాను పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సస్పెన్షన్ వేటు వేసింది. గతేడాది ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రయత్నించారని ఆరోపించిన గార్గ్...అందుకు సంబంధించి తనతో కేజ్రీవాల్ సాగించిన ఫోన్ సంభాషణను బయటపెట్టడం తెలిసిందే. -
బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరుకు పయనమయ్యారు. తల్లిదండ్రులతో కలసి ఘజియాబాద్ లోని తన నివాసం నుండి గురువారం ఉదయం బయలు దేరారు. గత కొన్ని రోజులుగా హై బ్లడ్ షుగర్, ఎడతెరిపిలేని దగ్గుతో బాధపడుతున్న ఆయన నాచురోపతీ చికిత్స కోసం బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పది రోజులపాటు కేజ్రీవాల్ బెంగళూరు లో ఉంటారు. ఆయన స్థానంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించనున్నారు. గత ఢిల్లీ ఎన్నికలు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయనకు షుగర్ బాగా పెరిగిందని, గత పన్నెండు రోజులుగా 300 స్థాయినుండి తగ్గడం లేదని...ఇన్సులిన్ తీసుకున్నా.. నియంత్రణలోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కే జ్రీవాల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ అనారోగ్యాన్ని గమనించిన ప్రధాని మోదీ బెంగళూరులోని యోగా గురువు ను సంప్రదించాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే.. ప్రశాంత్ భూషణ్, యోగీంద్రయాదవ్ డిసిషన్ మేకింగ్ ప్యానల్ ఉంటే తాను కార్యదర్శిగా ఉండనని కేజ్రీవాల్ అన్నట్టుగా తెలుస్తోంది. -
యోగా, ప్రకృతి వైద్యంపై అంతర్జాతీయ సదస్సు
కర్ణాటక రాష్ట్రంలోని ఉజిరేలో.. డిసెంబర్ 12 నుంచి 14 వరకు... సాక్షి, హైదరాబాద్: యోగా, ప్రకృతి వైద్య శాస్త్రాలపై డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని ఉజిరేలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు సదస్సు నిర్వహణ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 0825236188, 9743605658, 9483004400 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.