
డీఎంకే సర్వసభ్య సమావేశానికి సిద్ధం
► నేడు అరివాలయంకు కరుణ
► స్టాలిన్ నిర్వాహక అధ్యక్షుడయ్యేనా?
సాక్షి, చెన్నై : పార్టీ సర్వ సభ్య సమావేశానికి డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయంలో సర్వం సిద్ధమైంది. రెండున్నర నెలల అనంతరం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి బుధవారం అరివాలయంలో అడుగు పెట్టనున్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు నిర్వాహక అధ్యక్షుడి పగ్గాలు అప్పగించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో మద్దతు, వ్యతిరేక గళం బయలు దేరింది.
అదే సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆసుపత్రిలో చేరడం ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. ఆసుపత్రి నుంచి కరుణానిధి సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా బయటకు రావడంతో ఆనందం వికసింది.ఇక, డీఎంకే సర్వ సభ్య సమావేశాన్ని గత నెల 20వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించినా, కరుణ ఆసుపత్రిలో ఉండడంతో వాయిదా వేసుకున్నారు. చివరకు బుధవారం సమావేశానికి తగ్గ ఏర్పాట్లు చేశారు.
తేనాం పేటలోని అన్నా అరివాలయం వేదికగా ఉదయం పది గంటలకు జరగనున్న సర్వ సభ్యం భేటికి సర్వం సిద్ధమైంది. రెండున్నర నెలల అనంతరం కరుణానిధి అరివాలయంలో అడుగు పెట్టనున్నడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు జరిగాయి. ఇక, సర్వ సభ్య సమావేశం వేదికగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ కు ప్రమోషన్ కల్పించే రీతిలో నిర్ణయాలు తీసుకోవచ్చన్న ప్రచారం సాగుతోంది. కరుణానిధి వయోభారంతో ఉన్న దృష్ట్యా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు, తన ప్రతినిధిగా, రాజకీయ వారసుడు స్టాలిన్ ను నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కరుణానిధి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ నేతృత్వంలో సాగనున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సర్వ సభ్య సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇప్పటికే చెన్నైకు చేరుకున్నారు.