ఖరీఫ్‌కు సన్నద్ధం
73 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యం
ఐదు లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 21.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం
బీపీఎల్ కుటుంబాలకు ప్రత్యేక రాయితీ ధరలో విత్తన సరఫరా
140 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం
ఈనెల 21 నుంచి కృషి అభియన్ ప్రారంభం
బెంగళూరు: కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాతలను ఊరించేలా ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్‌కు ఉత్సాహంగా సిద్ధమవు తోంది. అందులో భాగంగా ఈ ఏడాది 73.21 లక్షల హెక్టార్లలో విత్తనం వేయడాన్ని లక్ష్యంగా ఉంచుకుంది. 34.14 లక్షల హెక్టార్లలో వరి, రాగి వంటి ఏకదళ ధాన్యం, 15.36 లక్షల హెక్టార్లలో ద్విదళ బీజ పంటలను రైతులతో సాగు చేయించనుంది. ఇక 11.58 లక్షల హెక్టార్లలో పత్తి, పొగాకు వాణిజ్య పంటలను 12.13 లక్షల హెక్టార్లలో ఆముదం తదితర నూనెగింజలను పంటల సాగును వ్యవవసాయ శాఖ లక్ష్యంగా ఉంచుకుంది. అందుకు అనుగుణంగా దాదాపు 20 రకాలకు చెందిన 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఇప్పటికే వివిధ జిల్లాలకు సరఫరా చేసింది. దారిద్ర రేఖ కంటే దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ఈ విత్తనాలను మిగిలిన వారితో పోలిస్తే మరింత తక్కువ ధరకు ఈ సారి వ్యవసాయ శాఖ అందజేయనుంది. ఇక ఈ ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 21.75 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేసుకుంటోంది. ఇందులో 8 లక్షల టన్నులు వేపనూనె మిశ్రీతమైన యూరియా కావడం గమనార్హం. వేపనూనె చేర్చిన యూరియా ఎరువుగానే కాకుండా కీటక నాశకంగా కూడా పనిచేస్తుంది.
దీని వల్ల రాష్ట్రానికి అవసరమైన మొత్తం ఎరువునూ వేపనూనెతో మిశ్రీతం చేర్చి రైతులకు అందజేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. తర్వాత కీటకనాశకాలకు పెట్టే ఖర్చుతో తగ్గి ఆమేరకు వ్యవసాయ పెట్టుబడి తగ్గుతుందనేది వ్యవసాయశాఖ అధికారులు భావన. ఇక గత ఏడాది 140 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నా కరువు కారణంగా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. ఈ సారి వర్షాలు ఆశాజనకంగా ఉంటామయని వాతావరణ శాఖ సూచనతో ఈ ఏడాది ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 140 మెట్రిక్ టన్నులుగా వ్యవసాయశాఖ నిర్దేశించుకుంది.
ఈనెల 21 నుంచి కృషి అభియాన్
ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పంటలకు సంబంధించి రైతులకు అందుబాటులో ఉంచిన విత్తనాలు, ఎరువులు, అద్దెకు వ్యవసాయ యంత్రాలు తదితర విషయాల పై అవగాహనకల్పించడానికి ఈనెల 21 నుంచి హోబళి స్థాయిలో కృషి అభియన్ పేరుతో రైతు సమావేశాలను నిర్వహిస్తాం. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రైతులకు ఈ సందర్భంగా వివరించేప్రయత్నం చేస్తాం. ఎక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులను రైతులకు అమ్మినట్లు మా దృష్టికి వస్తే అక్రమాలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం. -బీ.వై శ్రీనివాస్, డెరైక్టర్, వ్యవసాయశాఖ