పార్టీ అభ్యర్థిగా ప్రకటించలేదు, టికెట్ కేటాయించనూ లేదు, అయినా తానే ఫలానా పార్టీ అభ్యర్థిని అని ప్రచారం చేసుకోవడం ఈ రోజుల్లో మామూలు విషయమే. రాష్ట్రంలో ఇప్పుడు అనేకచోట్ల జరుగుతోంది కూడా. అయితే ఇది తప్పని సీఈవో సంజీవ్‌కుమార్ ప్రకటించారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
శివాజీనగర: రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో పోటీ చేసేవారు నామినేషన్ దాఖలు చేయకముందే అభ్యర్థినని ప్రచారం చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సంజీవ్‌కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఆయన బెంగళూరు ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొని మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేయకముందే పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేయటానికి వీలు లేదు, అయితే ఈ విషయంలో ఫిర్యాదులు తమ దృష్టికి రాలేదని, వస్తే అలాంటివారిపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఆశావహులు నామినేషన్లకు ముందే తమంతట తామే ఫలానా పార్టీ అభ్యర్థులమని ప్రకటించుకుని ప్రచారం చేయరాదన్నారు. నామినేషన్ సమర్పించాక, అభ్యర్థిగా ఎన్నికల కమిషన్ పరిగణించిన తరువాతనే ఎన్నికల ప్రచారం చేపట్టాలని తెలిపారు. సీఈఓ ఇంకా ఏమేం చెప్పారంటే...
♦ ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, కార్లలో ఎన్నికల కమిషన్‌ను కళ్లుగప్పి నగదును రవాణా చేయకుండా కట్టుదిట్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్రమాలపై ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకొంటారు.
♦ రాజకీయ విందుల్లో తాము స్వాధీనం చేసుకున్న ఆహారాన్ని పారవేయకుండా అనాథ ఆశ్రమం, నిరాశ్రయులకు పంపిణీ చేస్తాం.
♦ 2 చోట్ల పోటీ చేయవచ్చు ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో పోటీచేయవచ్చు. ఇందుకు ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. రెండు చోట్ల పోటీని నిరోధించే చట్టం ఏదీ లేదు.
♦ 2013లో జరిగిన విధానసభా ఎన్నికలకంటే ఈసారి ఎన్నికలను సక్రమంగా జరిగేందుకు పాటుపడుతున్నాం.
♦ ప్రస్తుతం 4.96 కోట్ల ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరో 8,5000 మంది ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఓటర్ల సంఖ్య 5 కోట్లకు చేరుతుంది.
♦ ఓటర్ల కోసం 58 వేలు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి 3 లక్షల 56 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నాం. అటవీ ప్రాంతాలు, ఆదివాసీల ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయగలిగేలా చూస్తాం. ఓటర్లను అధికారులు, రాజకీయ నాయకులు, పోకిరీలు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకొంటాం.
♦ తీర్థహళ్ళి చెక్‌పోస్ట్‌లో రూ.3 కోట్ల 45 లక్షల అక్రమ సొమ్మును పట్టుకున్నాం, రెండు రోజుల తరువాత ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెప్పించుకున్నట్లు ఆధారాలు సమర్పించగా వాపసు ఇచ్చేశాం.
♦ ఎన్నికల్లో అభ్యర్థులు పత్రికలు, టీవీ చానెళ్లలో ప్రచారం చేసుకోవాలంటే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందాలి. ఒకవేళ అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తే ప్రచురించబడిన ప్రకటనలను పరిశీలించేందుకు ఓ కమిటీ ఉంటుందని, అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటారు. దీనిపై మీడియాకు, నాయకులకు అగాహన కల్పించాం.
Comments
Please login to add a commentAdd a comment