సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని చర్చిలపై వరుసగా జరుగుతోన్న దాడులను వ్యతిరేకిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వందల సంఖ్యలో క్రైస్తవ మతస్తులు సెంట్రల్ ఢిల్లీలోని సెక్రెడ్ హార్ట్ కేథడ్రల్ ఎదుట గుమిగూడారు. ఈ సందర్భంగా మాకు న్యాయం కావాలి, మాపై దాడులు ఆపండి, మేము శాంతిని కోరుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులతో చర్చి ఆవరణలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించిన తర్వాత వారు హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం వైపు కదిలారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన సుమారు 200 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసనకారులు చర్చి ఆవరణలో నిరసన ప్రదర్శనకు అనుమతి తీసుకోలేదని, రోడ్లపై ప్రదర్శన జరపడానికి తాము అనుమతి ఇవ్వబోమని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
అనంతరం ఆందోళనకారులు మాట్లాడుతూ.. కొద్ది కాలంగా చర్చిలపై దాడులు పెరిగాయని, రాజధానిలోనే ఐదు చర్చిలపై దాడులు జరిగాయని కానీ నిందితులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. తమకు న్యాయం కావాలని, చర్చిలకు రక్షణ కావాలని మాత్రమే తాము కోరుతున్నామని ఢిల్లీ కేథలిక్ ఆర్కిడియోసిస్ ప్రతినిధి శవరిమత్తు శంకర్ చెప్పారు. ఈ విషయమై తాము రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా వినతిపత్రాలు సమర్పించామని, అయినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వసంత్‌కుంజ్‌లో జరిగిన దాడి ఆరవదని, మతవిద్వేషంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. చర్చిలపై జరుగుతోన్న దాడులపై ప్రత్యేక దర్యాపుృ బందాలతో దర్యాప్తు జరిపించాలని నిరసన కారులు డిమాండ్ చేశారు.
చర్చిలపై దాడులకు నిరసనగా ప్రదర్శన
Published Thu, Feb 5 2015 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement