సాక్షి, న్యూఢిల్లీ: కార్మిక సమస్యలు, ప్రైవేటీకరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ వ్యతిరేకంగా, రైతు డిమాండ్లు, సామాన్య ప్రజల డిమాండ్ల కోసం కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర అఖిల భారత ఫెడరేషన్ అందరూ కలిసి మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత ప్రకటించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఉపాధిహామీ కూలీ పెంచడంతో పాటు పనిదినాలు పెంచాలని ఏడాదిన్నరగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్లకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని, కీలక రంగాలకు పథకాలకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, కార్మిక, రైతు ప్రజా సమస్యలపై చేస్తున్న నిరసనలు, సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని హేమలత పిలుపునిచ్చారు.
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం: వెంకట్
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని, విభజన హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పేర్కొన్నారు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని చట్టంలో ఉన్న అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.60 వేల కోట్ల నిధులు తగ్గించారని విమర్శించారు. యూపీ ఎన్నికల్లో భాగంగా 9 ప్రాంతాల్లో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశాలు పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment