సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రజాస్వామ్యయుతంగా చేయలేకపోయిందని కాంగ్రెస్ తీరును ప్రధాని నరేంద్ర మోదీ ఎండగడితే టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన నొప్పేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. విభజన సమయంలో సరైన చర్చ జరపడంలో కాంగ్రెస్ విఫలమైందని, అందుకే తిట్టారన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను విమర్శిస్తే మోదీ దిష్టిబొమ్మల దహనానికి టీఆర్‌ఎస్ పిలుపునివ్వడమేంటో అర్థం కావట్లేదన్నారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టారని దుయ్యబట్టారు. బుధవారం మరో ఎంపీ సోయం బాపూరావుతో కలిసి తెలంగాణ భవన్‌లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటును ఎక్కడా మోదీ వ్యతిరేకించలేదు. తెలంగాణకు బీజేపీ పార్టీ తొలి నుంచీ మద్దతిస్తూ వచ్చింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పోరాటానికి అండగా నిలిచింది. పార్టీ నేత సుష్మాస్వరాజ్ బిల్లుకు మద్దతుగా నిలిచారు. పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత కూడా ఆమె ఒక్కరే సభలో ఉన్నారు’అని గుర్తు చేశారు.
కేసీఆర్ ఒక్క లాఠీ దెబ్బనైనా తిన్నాడా?
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘తెలంగాణ బిల్లు సమయంలో టీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటే విజయశాంతి మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కేసీఆర్ ఎక్కడ పోయాడు? ఏడ పన్నడు? ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనలే? కేసీఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టం లేదు. అందుకే దూరంగా ఉన్నడు’అని మండిపడ్డారు. ‘రాష్ట్రం కోసం ఒక్క లాఠీ దెబ్బనైనా కేసీఆర్ తిన్నాడా, ఒక్క రోజైనా జైలుకెళ్లాడా’అని ప్రశ్నించారు. కాగా, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, సంజయ్‌ల ఆధ్వర్యంలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ బీజేపీలో చేరారు.
కాంగ్రెస్‌కు కంగ్రాట్స్.. కొత్త అధికార ప్రతినిధి దొరికినందుకు..
సాక్షి, హైదరాబాద్: ‘చీకట్లోని కుట్రలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్‌కు కంగ్రాట్స్.. టీఆర్‌ఎస్ రూపంలో కొత్త అధికార ప్రతినిధి దొరికినందుకు’ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణతో పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో ప్రధాని వివరించగానే ఆ పార్టీని సమర్థిస్తూ టీఆర్‌ఎస్ రంగంలోకి దిగింది. నాణేనికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు ముఖాలనే మా పార్టీ వైఖరి వాస్తవమని నిరూపితమైంది’ అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment