ఓటు హక్కు వినియోగించుకోవడంపై సెక్స్‌వర్కర్లు
న్యూఢిల్లీ: ఏ పండగొచ్చినా, ఏ వేడుక జరుపుకున్నా అవన్నీ నాలుగు గోడల మధ్యే. ఎందుకంటే వారు బయట ప్రపంచాన్ని చూసేది చాలా తక్కువ. కానీ గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కారణంగా వారు బయటకు వచ్చారు. అందరితో సమానంగా క్యూలైన్లలో నిలబడి తమకు నచ్చిన నేతకు ఓటు వేశారు. ఇలా సాధారణ జనంతో సమానంగా బారులు తీరడం, ఓటుహక్కు వినియోగించుకోవడం గురించి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే బయటి ప్రపంచాన్ని చాలా తక్కువగా చూసేదే తక్కువ. ఒకవేళ బయటకు వచ్చినా మిగతా జనాలతో కలిసిపోయే అవకాశమే రాదు. ఒకవేళ వచ్చినా చుట్టూ ఉన్న జనం వారి గురించి వింతగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వారంతా సెక్స్‌వర్కర్లు. కానీ గురువారం మాత్రం ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్లలో నిలబడినా వారి గురించి ఎవరూ వింతగా మాట్లాడుకోలేదు.
జీబీ రోడ్డులోని రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న సెక్స్‌వర్కర్లు తమ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్‌కు కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేసేందుకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో మేమూ భాగస్వాములమవుతున్నందుకు గర్వంగా కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో చాందినీచౌక్ నియోజకవర్గం గురించి ఈసారి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
అందుకు కారణం ఇక్కడి నుంచి మహామహులు బరిలోకి దిగుతుండడమే. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి కపిల్ సిబల్, బీజేపీ నుంచి హర్షవర్ధన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశుతోష్ బరిలోకి దిగారు. ఇలాంటివారిలో ఒకరిని ఎంచుకొని ఓటువేసే హక్కు మాకు లభించింది. ఓటు వేసి బయటకు వచ్చాక గొప్పగా అనిపించింది. నేనూ భారతీయ పౌరురాలినేననే భావన కలిగింద’ణి పూర్ణిమా(పేరు మార్చాం) అనే సెక్స్‌వర్కర్ తెలిపింది.
‘ప్రజలు మా గురించి చులకనగా మాట్లాడుకోని రోజు ఏదైనా ఉందంటే అది బహుశా ఇదేనేమో. అందరితో సమానంగా మేం కూడా క్యూలైన్లలో నిలబడ్డాం. మాకు నచ్చిన వ్యక్తికి ఓటు వేశాం. ఇదేవిధంగా మరోచోట ఎక్కడైనా క్యూలైన్లలో నిలబడితే అనేక అవమానాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. మాటలతో, చేష్టలతో, అవమానకరమైన చూపులతో నీచంగా చూసేవారు కూడా గురువారం సాధారణ పౌరుల్లాగే చూశార’ని ఆరణి అనే మరో సెక్స్‌వర్కర్ తన మనసులోని అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది.
ఫరీదా అనే 65 సంవత్సరాల వృద్ధురాలు మాట్లాడుతూ... ‘ఈసారి మావాళ్లు చాలామంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో మావారు కూడా కీలక పాత్ర పోషిస్తారనేది నా అభిప్రాయం. మంచి ప్రభుత్వం రావాలి.. మా సమస్యలను తీర్చి, మమ్మల్నీ భారతీయ పౌరులుగా గుర్తించాలి. మిగతావారిలాగే మేం కూడా అన్ని హక్కులు అనుభవించేలా పరిస్థితులు కల్పించాలి.
నేరాలను అరికట్టాలి. ఇవి మాత్రమే వచ్చే ప్రభుత్వం నుంచి మేం ఆశిస్తున్న అంశాల’న్నారు. భారతీయ పతితా ఉద్ధార్ సభా(బీపీయూఎస్) ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ అహ్మద్ మాట్లాడుతూ... ‘బీబీరోడ్డులోని సెక్స్‌వర్కర్లలో 1,800 మంది ఓటు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో దాదాపుగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిసింద’న్నారు.
గర్వంగా ఉంది..!
Published Thu, Apr 10 2014 10:49 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement