- అవినీతితో అన్నీ అనర్థాలే
- = గణతంత్ర వేడుకల్లో గవర్నర్ భరద్వాజ్
- = ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పాలకులకు హితవు
సాక్షి, బెంగళూరు : దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోందని గవ ర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల స్థానిక ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నాయన్నారు. నగరంలోని మానెక్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భరద్వాజ్ జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వాలు... ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాన త్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకోసం సమాజంలోని ప్రతి వర్గానికి...ప్రతి రంగంలో సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అధికార పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా కష్టించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వాగ్ధానాలన్నీంటిని తప్పక నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలనీ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ‘సెక్యులరిజం ఈజ్ ఇండియన్ డెస్టినీ’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం వ్యాఖ్యలను గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ గుర్తు చేశారు.
ఎందరో వీరులు ప్రాణాలు త్యాగం వల్ల నేడు భారతదేశం గణతంత్ర రాజ్యాల్లో ఒకటిగా నిలించిందన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులతో పాటు పొరుగు దేశాలకు దీటుగా త్రివిధ దళాలకు ఉపయుక్తమైన ఆయుధ సంపత్తిని అందించడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు కర్ణాటకతోపాటు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కాగా, గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధాన ంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అమలవుతున్న ‘సకాల’ పథకం ఇతర రాష్ట్రాలకే కాకుండా ప్రపంచ దేశాల ప్రశంసలు కూడా అందుకుందన్నారు. అయితే రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల ఆరోగ్యం, ఫ్లోరైడ్ రహిత తాగునీటి సరఫరా విషయాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితోపాటు పలువురు శాసనసభ సభ్యులు పాల్గొన్నారు.