లోకాయుక్త దాడులు
- ఏడుగురు అధికారుల ఇళ్లలో సోదాలు
- రూ. 9.70 కోట్ల సొత్తు గుర్తింపు
సాక్షి,బెంగళూరు : అవినీతి ఆరోపణలున్న ఏడుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో రాష్ట్ర లోకాయుక్త బుధవారం సోదాలు నిర్వహించింది. 19 చోట్ల ఏకకాలంలో చేసిన తనిఖీల్లో రూ.9.70 కోట్ల సొత్తు వెలుగు చూసింది. కాగా, లోకాయుక్త సోదాల్లో బయటపడిన సొత్తు విలువ బహిరంగ మార్కెట్‌లో మూడు రెట్లకుపైగా ఉంటుంది. లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్‌ఎన్ సత్యనారాయణరావు తెలిపిన వివరాల మేరకు..
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏబీ హేమచంద్ర రూ 2 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. అక్రమ సంపాదన అతని ఆదాయం కంటే 97 శాతం ఎక్కువగా ఉంది.
కర్ణాటక రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, బెంగళూరులో ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం వేణుగోపాల్ తన ఆదాయం కంటే 120 రెట్ల ఎక్కువ ఆస్తులు కూడబెట్టారు.
కర్ణాటక కౌన్సిల్ ఫర్ టెక్నికల్ అప్‌గ్రెడేషన్, బెంగళూరులో మేనేజింగ్ డెరైక్టర్ వీ.మునియప్ప రూ.2.77 కోట్ల స్థిర, చరాస్తులు కూడబెట్టారు. అతని సంపాదనతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ 115 రెట్లు అధికం.
కర్ణాటక స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టార్ బీఎన్ మునినారాయణప్ప తన ఆదాయం కంటే 278 రెట్ల ఎక్కువ ఆస్తులు కూడబెట్టారు.
ప్రజాపనుల శాఖ దేవరాజ్‌అర్స్ ట్రక్ టర్మినల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హెచ్‌ఎస్ ప్రసన్నకుమార్ రూ.2.13 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, రూ.58 లక్షల విలువ చేసే చరాస్తులను కూడబెట్టారు. అవి అతని ఆదాయంతో పోలిస్తే 216 రెట్లు అధికం.
గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ ఇంజనీర్ హవగిరిరావు తన ఆదాయం కన్నా 247 రెట్ల అధికం ఆస్తులు కూడబెట్టారు.
రెవెన్యూ శాఖలో గుల్బర్గా రీజనల్ కమిషనర్ సయ్యద్ నజీర్ అహ్మద్ వజీర్ తన ఆదాయం కన్నా 96 రెట్లు ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారు.