న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని, విచ్చలవిడిగా అవినీతి జరిగిందంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు ఆదేశించాలని అడగబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేయి కలపనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూ షన్ క్లబ్‌లో చంద్రబాబు విలేకరుల సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఎన్డీయే ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోగా.. కేంద్ర నిధులను దుర్వినియోగం చేశామని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నామంటూ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, వారిచ్చిన నిధులకు యూసీలు(వినియోగ పత్రాలు) ఇచ్చామని తెలియజేశారు. యూసీలు ఇచ్చిన తర్వాత కూడా అవినీతి ఆరోపణలు ఆగడం లేదన్నారు.
మీడియా ప్రశ్నలకు సీఎం సమాధానాలు
ప్రశ్న: ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు కేంద్రం బురద జల్లుతోందని చెబుతున్నారు కదా! ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని అడుగుతారా?
చంద్రబాబు: నేనెందుకు అడగాలి? నాకున్న విశ్వసనీయత గురించి ఏమనుకుంటున్నారు? నేను అన్నీ నీతిగానే చేశాను. 10.5 శాతం వృద్ధిరేటు సాధించాను. అదంతా నా వల్లే సాధ్యపడింది.
ప్రశ్న: ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ కలిసి రావాలని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఆ దీక్షలో టీడీపీ పాల్గొంటుందా?
చంద్రబాబు: వైఎస్సార్ సీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. కుమ్మక్కు ఆట ఆడుతోంది. ఇక్కడే మేం పోరాడుతాం. కేంద్రంపై పోరాడుతాం. అన్ని పార్టీలు, ప్రజలు కలిసి రావాలి. అలా కలిసి పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుంది.
ప్రశ్న: మీరు ప్రతిపక్షంతో కలసి పోరాటం చేయొచ్చు కదా?
చంద్రబాబు: ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అన్యాయం చేసింది. వాళ్లు మన వాదనను బలహీనపరుస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కూడా వారితో కలుస్తోంది.
ప్రశ్న: ప్రతిపక్ష నేత జగన్‌తో కలిసి ఎందుకు పోరాటం చేయకూడదు? రాష్ట్రానికి న్యాయం జరిగేలా కృషి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉంది కదా?
చంద్రబాబు: ప్రజలు అధికారాన్ని మాకు అప్పగించారు. జగన్‌కు ఇవ్వలేదు. సీఎంగా నేను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాను. కానీ జగన్, జనసేన రాలేదు. బీజేపీ నన్ను బలహీనపరుస్తోంది. అందరూ కలసి నా బలాన్ని పెంచాలి. నాకు మద్దతు ఇవ్వడం వారి(ప్రతిపక్షాల) బాధ్యత కాదా?
ప్రశ్న: హోదా ముగిసిన అధ్యాయమని మీరు అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ హోదా అడుగుతున్నారు. రాజకీయ కారణాలతోనే వైఖరి మార్చుకున్నారని బీజేపీ అంటోంది.
చంద్రబాబు: ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవించాలి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి.
ప్రశ్న: లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఏఐఏడీఎంకే అడ్డుపడుతోంది. చర్చకు అడ్డు పడొద్దని తమిళనాడు ముఖ్యమంత్రికి ఎప్పుడైనా విజ్ఞప్తి చేశారా?
చంద్రబాబు: మేం కృష్ణా జలాలను తమిళనాడుకు ఇస్తున్నాం. కాబట్టి వారు మాకు సహకరించాలి.
ప్రశ్న: ఇప్పుడు కృష్ణా జలాలు ఇస్తున్నామని, సహకరించకపోతే ఇవ్వమని బెదిరిస్తున్నారా?
చంద్రబాబు: బెదిరించడం లేదు. అలా చేయను కూడా. తమిళనాడుతో మాకు సత్సంబంధాలున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అడ్డు పడొద్దని ఏఐఏడీఎంకేకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.
సీబీఐ విచారణ అడగను
Published Thu, Apr 5 2018 1:26 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment