- సేవలతో పాటు సేవ్ ..
- సుమారు రూ.5 వేల కోట్ల ఆదా!
- లంచం కూడా కలుపుకుంటే మొత్తం రెండింతలు
- 12 రాష్ట్రాల్లో సకాల .. అమల్లో కర్ణాటక టాప్
- తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలంటూ రాష్ట్రానికి ‘కేంద్రం’ వినతి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘సకాల’ంలో సేవలు అందించడంలో దేశంలోనే కర్ణాటక టాప్. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సేవలను నిర్ణీత వ్యవధిలో పొందడానికి ఉద్దేశించిన ఈ ‘సకాల’ వల్ల ప్రజలకు ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఆదా అయ్యాయని ఓ పరిశీలనలో తేలింది. లంచం కూడా కలుపుకొంటే ఈ మొత్తం రెండింతలకు పైగా ఉండవచ్చని అంచనా. సకాల కింద 45 శాఖల ద్వారా 447 రకాల సేవలను అందిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు లేదా సంస్థలకు వచ్చిన ప్రతి సారీ రూ.200 వరకు ఖర్చు అవుతుందనే అంచనాతో ఈ లెక్కలు వేశారు.
గతంలో ఏదైనా శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని లేదా ఇతర సేవను పొందడానికి అర్జీదారు కనీసం ఆరేడు సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వరకు సకాల కింద అందిన, పరిష్కరించిన దరఖాస్తులను లెక్కగట్టి ఆదా అయిన మొత్తాన్ని తేల్చారు. సిబ్బంది వ్యవహారాలు, పాలనా సంస్కరణల శాఖ (డీపీఏఆర్) లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సకాల కింద నాలుగు కోట్ల దరఖాస్తులను పరిష్కరించారు. దరఖాస్తుల పరిష్కారంలో సగటు జాప్యం రెండు శాతం కాగా, తిరస్కృతుల సగటు నాలుగు శాతంగా నమోదైంది.
సకాల పరిధిలోకి ప్రభుత్వం దశలవారీ అనేక సేవలను చేర్చింది. 12 రాష్ట్రాల్లో సకాల అమలవుతుండగా, కర్ణాటక సహా రెండు రాష్ట్రాల్లో మాత్రమే వందకు పైగా సేవలను సకాలలో చేర్చారు. కర్ణాటకలో సకాల ద్వారా 447 రకాల సేవలు అందిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ సేవల సంఖ్య వెయ్యికి పెరిగితే ప్రజలకు మరింతగా ఆదా అవుతుంది.
ఇంకా పలు ముఖ్యమైన శాఖలు సకాల కిందకు రావడానికి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ, డీపీఏఆర్ తరచూ వాటికి గుర్తు చేస్తూనే ఉంది. ప్రజలకు లభించిన ఈ అపూర్వ సదుపాయాన్ని చూసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ పార్లమెంట్‌లో సిటిజన్స్ ఛార్టర్ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా సకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కోరింది. 2011లో సకాల రాష్ట్రంలో అమలులోకి వచ్చింది.