ఆర్కేనగర్ ఉచ్చు
► ‘కేసు’ మోత మోగేనా?
► సీఈసీ సిఫారస్సు
► ఇరకాటంలో సీఎం సహా ఆరుగురు
► నేడు కోర్టుకు విచారణ
ఆర్కేనగర్‌లో నగదు బట్వాడా వ్యవహారం సీఎం పళని స్వామితో పాటు పలువురు మంత్రులు, అభ్యర్థి దినకరన్ మెడకు ఉచ్చుగా మారేనా.. అన్న ప్రశ్న బయలుదేరింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో పరిణామాలు సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల మోత మోగేనా అన్న ఉత్కంఠ బయలుదేరింది. ఇందుకు తగ్గ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఖాళీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్థానం భర్తీకి ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గెలుపు లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం దినకరన్, పురట్చి తలైవి శిబిరం మధుసూదనన్, ఎంజీయార్, అమ్మ దీప పేరవై దీప, డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, బీజేపీ అభ్యర్థి గంగై అమరన్..ఇలా 63 మంది తీవ్రంగానే కుస్తీ పట్టారు. అయితే, దినకరన్ తన అధికార, ధన బలాన్ని ప్రయోగించడం కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఆగ్రహాన్ని రేపింది. ఐటీ దాడుల్లో లభించిన ఆధారాలు సీఈసీ టేబుల్‌కు చేరాయి.
నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టుగా ఆధారాలతో నిరూపితం కావడంతో రాత్రికి రాత్రే ఉప ఎన్నిక రద్దయ్యింది. ఇంతవరకు అన్నీ బాగానే సాగినా, తదుపరి పరిణామాలతో దినకరన్ ఓ జట్టుగా, సీఎం పళనిస్వామి మరో జట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో కొనసాగే పరిస్థితి నెలకొంది. అలాగే, రెండాకుల చిహ్నం కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించి కటకటాల్లోకి సైతం దినకరన్ వెళ్లి రాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్కేనగర్ నగదు బట్వాడా ఉచ్చు ప్రస్తుతం అందరి మెడకు ఉచ్చుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న తప్పడం లేదు. ఇందుకు తగ్గ పరిణామాలు చక చకా సాగుతున్నాయి.
కేసు మోత మోగేనా
చెన్నైకు చెందిన న్యాయవాది వైరకన్ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్కే నగర్ నగదు బట్వాడాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనని సీఈసీని వివరాలు రాబట్టే యత్నం చేశారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో నగదు బట్వాడాపై పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. సమాచార హక్కు చట్టం మేరకు ఆయన కోరిన సమాచారాన్ని సీఈసీ అందజేసింది. ఇందులో పేర్కొన్న వివరాల మేరకు సీఎం పళనిస్వామి, మంత్రులు సెంగోట్టయన్, విజయభాస్కర్, సెల్లూరు రాజు, తంగమణి, వేలుమణి, అభ్యర్థి దినకరన్ మీద కేసు నమోదుకు సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
అయితే, ఇందుకు తగ్గ అధికారిక సమాచారం ఏ అధికారికి సీఈసీ నుంచి రానట్టు తెలిసింది. ఒకవేళ సీఈసీ సిఫారసు చేసి ఉన్నా, దానిని తుంగలో తొక్కినట్టు స్పష్టం అవుతోంది. న్యాయవాది వైరకన్నుకు మాత్రం తమ సమాచారంలో పూర్తి వివరాలను అందజేసి ఉండడం గమనార్హం. సోమవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానున్న దృష్ట్యా, సమగ్ర వివరాలను బెంచ్ ముందు ఉంచే అవకాశాలున్నాయి. సీఈసీ సిఫారసు సమాచారంతో సీఎంతో పాటు మంత్రులు, దినకరన్‌పై కేసుల్ని నమోదు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టే పనిలో ఉండడం గమనార్హం.
ఈ విషయంగా డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల్ని నమోదు చేయాల్సిందేని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పురట్చి తలైవి శిబిరం ఎమ్మెల్యే పాండిరాజన్ పేర్కొంటూ, సీఈసీ కేసు నమోదుకు సిఫారసు చేయడం ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, హైకోర్టులో సాగే విచారణ మేరకు కేసుల మోత మోగేనా లేదా, వాయిదాల పర్వం సాగేనా..అన్నది వేచి చూడాల్సి ఉంది.