దేశానికే ఆదర్శం
- రాష్ర్ట మహిళలకు రాహుల్ ప్రశంస
- చెన్మమ్మ, మల్లమ్మల పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
- మహిళలపై దాడులను నిరోధించేందుకు కృషి
- రాజకీయాల్లోకి విరివిగా మహిళలు రావాలి
- మిహ ళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్న విపక్షాలు
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని స్త్రీశక్తి దేశానికే ఆదర్శమంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శ్లాఘించారు. తుమకూరు మహాత్మాగాంధీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కిత్తూరు రాణి చెన్మమ్మ, బెళవడి మల్లమ్మల స్మరణతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాంటి వీర వనితల పోరాట పటిమ, పరిపాలనా దక్షత అందరికీ ఆదర్శం కావాలన్నారు.
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, 20 లక్షల మంది స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు బ్యాంకులతో అనుసంధానం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరోధించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని అన్నారు.
తాను దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చానని, ఎక్కడైతే మహిళలకు పూర్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభించాయో అక్కడ మాత్రమే అభివృద్ధి కనిపించిందని, ఎక్కడైతే మహిళలు అణచివేతకు గురయ్యారో అక్కడ ఏ మాత్రం అభివృద్ధి కనిపించలేదని అన్నారు. మహిళలు రాజకీయ రంగంలోకి ఎక్కువ సంఖ్యలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకురావడానికి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే విపక్షాలన్నీ ఏకమై ఆ బిల్లును అడ్డుకుంటున్నాయని చెప్పారు.
ఆరు లేన్ల జాతీయ రహదారి ప్రారంభం..:నాలుగో నంబర్ జాతీయ రహదారిలో తుమకూరు-చిత్రదుర్గలను కలుపుతూ నిర్మించిన ఆరు లేన్ల రహదారిని రాహుల్‌గాంధీ లాంఛనంగా ప్రారంభంచారు. తుమకూరును సందర్శించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడి సిద్ధగంగ మఠం విద్యారంగంలో ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. తుమకూరులో మహిళా సదస్సులో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి కుణిగల్, మద్దూరు, మండ్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తూ మైసూరు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.
నల్ల రిబ్బన్‌లతో ‘ఆప్’ ధర్నా : రాహుల్‌గాంధీ ప్రసంగం ప్రారంభమయ్యే సమయంలో ఆప్ కార్యకర్తలు నల్లరిబ్బన్‌లు, నల్లబ్యాడ్జీలతో కుణిగల్ దారిలో ధర్నాకు దిగారు. జనలోక్‌పాల్ బిల్లు అమల్లోకి రాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు ఆప్ కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.