గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేకు లేదని బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ చురక అంటించారు.
సాక్షి, ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేకు లేదని బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ చురక అంటించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే, ఆయన సీఎం పదవికి రాజీనామా చేసుంటే బాగుండేదని రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని అన్నారు. నగరంలో శుక్రవారం దేవేంద్ర ఫడ్నవీస్ విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో రాజ్‌కు అంతగా ప్రాధాన్యత లేదు.
కేవలం పబ్లిసిటీ కోసం ఇతర నాయకుల ప్రసంగాలను అనుకరిస్తూ (మిమిక్రీచేస్తూ) నవ్వించడం, సందర్భం లేకుండా అర్థంపర్ధం లేని వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తూ తెరమీదకు రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘దేవేగౌడతోపాటు మరికొందరు ప్రధానులు ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగారు. ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ రాజీవ్ గాంధీ నేరుగా దేశ ప్రధాని అయ్యారు. వీరంతా ఏ పదవులకు రాజీనామా చేశార’ని శివసేన ఎంపీ ఎంపీ సంజయ్ రావుత్ ప్రశ్నించారు. చరిత్ర తెలియకుండా రాజ్ ఇలా వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. ఇదిలావుండగా నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న ఎమ్మెన్నెస్ ఈ విధంగా వ్యవహరించడంపై స్థానిక బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో కూడిన వివిధ కీలక ప్రాజెక్టులకు రాజ్‌ఠాక్రే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ పదాధికారులు, కార్యకర్తలుు హాజరు కావల్సి ఉంది. అయితే ఆగ్రహానికి గురైన బీజేపీ నాయకులు రాజ్ నాసిక్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నాసిక్‌లో రాజ్ చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిమాణాల నేపథ్యంలో నాసిక్ కార్పొరేషన్‌లో బీజేపీ, ఎమ్మెన్నెస్ మధ్య విభేదాలు పొడచూపే అవకాశముంది.