పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం! | Raja Gopal Crime History Special Story Tamil nadu | Sakshi
Sakshi News home page

జోస్యంతో జీవితం తలకిందులు

Published Fri, Jul 19 2019 8:03 AM | Last Updated on Fri, Jul 19 2019 8:12 AM

Raja Gopal Crime History Special Story Tamil nadu - Sakshi

జీవజ్యోతి, ప్రిన్స్‌ శాంతకుమార్, రాజగోపాల్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి’ అనే ప్రాచీన నానుడిలో కొద్దిగా మార్పు చేస్తే ‘తింటే హోటల్‌ శరవణ భవన్‌లోనే తినాలి...’అన్నంతగా తీర్చిదిద్దాడు ఆ హోటల్‌ అధినేత రాజగోపాల్‌. అయితే అన్నంపెట్టే ఆ చేయి కాలక్రమంలో హత్య కూడా చేసింది. జోస్యుడు చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు. పరువు ప్రతిష్టలను, చివరకు యావజ్జీవ శిక్షా ఖైదీగా ప్రాణాలను సైతంపోగొట్టుకున్నాడు. సినిమా ఫక్కీలో చోటుచేసుకున్న ఉదంతాలతో రాజగోపాల్‌ జీవిత చరమాకం విషాదకరంగా ముగిసింది. 

క్లీనర్‌ టూ ఓనర్‌: తూత్తుకూడి జిల్లా పున్నైనగర్‌ అనే చిన్నపాటి గ్రామంలో జన్మించిన రాజగోపాల్‌ తన 12 ఏళ్ల వయస్సు నుంచి కాయకష్టం పనులకు దిగాడు. పొట్టకూటి కోసం చెన్నైకి చేరుకుని చిన్నపాటి హోటల్‌లో క్లీనర్‌గా పనికి చేరాడు. ఆ తరువాత టీ మాస్టర్‌ బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత చెన్నై కేకే నగర్‌లో ఫలసరుకుల దుకాణాన్ని తెరిచాడు. 1981లో ఒక వినియోగదారుడు వచ్చి ‘అర్జంటుగా సరుకులు ఇవ్వండి, వండుకుని తినాలి, ఈ ప్రాంతంలో ఒక్క హోటల్‌ కూడా లేదు’ అని చెప్పిన మాటలు రాజగోపాల్‌ చేత హోటల్‌ పెట్టించాయి. వేరే వ్యక్తి నడుపుతున్న కామాక్షి భవన్‌ అనే హోటల్‌ను కొనుగోలుచేసి నడుపుతూ కొన్నేళ్ల తరువాత దానినే హోటల్‌ శరవణభవన్‌గా పేరు మార్చాడు. ఆ హోటల్‌ అంచలంచెలుగా, శాఖోపశాఖలుగా ఎదుగుతూ విదేశీ శాఖల స్థాయికి విస్తరించింది. చెన్నైలోని 25 శాఖలను కలుపుకుని దేశ  విదేశాల్లో మొత్తం 46 శాఖలున్నాయి. శాఖాహారం అంటేనే శరవణ భవన్‌ అనే పేరు తెచ్చుకుంది.

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం: ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రాజగోపాల్‌ జీవితాన్ని ఓ వ్యక్తి చెప్పిన జోస్యం అథఃపాతాళానికి నెట్టివేసింది. రెండు పెళ్లిళ్లతో సంతృప్తి చెందక మూడోపెళ్లి కోసం వెంపర్లాట హంతకుడిగా మార్చివేసింది. నాగపట్నం జిల్లా వేదారణ్యంకు చెందిన వ్యక్తి హోటల్‌ శరవణ భవన్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఈరకంగా మేనేజర్‌ కుమార్తె జీవజ్యోతితో రాజగోపాల్‌కు పరిచయం ఏర్పడగా, అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న ఆయన జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలని తలంచి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే జీవజ్యోతి ప్రిన్స్‌ శాంతకుమార్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. దీంతో కక్ష పెంచుకున్న రాజగోపాల్‌ ఎలాగైనా జీవజ్యోతిని సొంతం చేసుకోవాలని కుట్రపన్నాడు. జీవజ్యోతిని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా ప్రిన్స్‌ శాంతకుమార్‌ను బెదిరించాడు. అయితే ఇందుకు అతను ససేమిరా అన్నాడు. ఇదిలా ఉండగా 2001 అక్టోబరు 26వ తేదీన శాంతకుమార్‌ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో భార్య జీవజ్యోతి చెన్నై వేలాచ్చేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తరువాత శాంతకుమార్‌ శవం కొడైక్కెనాల్‌ కొండగుట్టలో లభ్యమైంది.

హతుడి భార్య జీవజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించిన చెన్నై పూందమల్లి కోర్టు... ప్రధాన నిందితుడు రాజగోపాల్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.55 లక్షల జరిమానా విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది.  ఈ తీర్పును సవాలు చేస్తూ  రాజగోపాల్‌ తదితరులు మద్రాసు హైకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేయగా, కింది కోర్టు ఇచ్చిన 10 ఏళ్ల జైలు శిక్ష తీర్పును యావజ్జీవ శిక్షగా పెంచుతూ 2009లో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రాజగోపాల్‌ సహా నిందితులంతా సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, ఈ అప్పీలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీన ఖరారుచేసింది. అంతేగాక జూలై 7వ తేదీన కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు 9 మంది నిందితులు 7వ తేదీన చెన్నై 4వ అదనపు కోర్టులో లొంగిపోగా వారందరినీ వెంటనే జైల్లో పెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజగోపాల్‌ మాత్రం అనారోగ్యకారణాలను చూపుతూ ఈనెల 7వ తేదీన సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసి లొంగిపోయేందుకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ గడువు పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.

జైలుశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాలు మూసుకుపోవడంతో రాజగోపాల్‌ ఈనెల 9వ తేదీన చెన్నైలోని సిటీ సివిల్‌ కోర్టుకు స్ట్రెచర్‌పై పడుకుని వచ్చి లొంగిపోయాడు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన రాజగోపాల్‌ను మాత్రం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స సరిలేదు, ప్రయివేటు అసుపత్రికి తరలించేందుకు అనుమతివ్వాల్సిందిగా ఆయన కుమారుడు ఈనెల 15 తేదీన పిటిషన్‌ వేయగా 16న కోర్టు అనుమతించింది. అయితే ఇక్కడి నుంచి తరలిస్తే ప్రాణాలకు ముప్పువస్తుందని ఆసుపత్రి డీన్‌ హెచ్చరించినా అందుకు తానే బాధ్యత వహిస్తానని కుమారుడు హామీ ఇచ్చి చెన్నైలోని మరో ప్రయివేటు ఆసుపత్రిలో బుధవారం చేర్పించాడు.అయితే 24 గంటలు ముగిసేలోపే గురువారం ఉదయం రాజగోపాల్‌ ప్రాణాలువిడిచాడు.

ఒక్కరోజుకూడా జైల్లో ఉండలేదు: జీవజ్యోతి
నా భర్తను దారుణంగా హత్యచేసిన కేసులో ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లకుండా రాజగోపాల్‌ మరణించడాన్ని తాను సహించలేక పోతున్నానని హతుడు ప్రిన్స్‌ శాంతకుమార్‌ భార్య జీవజ్యోతి ఈ సందర్బంగా గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ‘శాంతకుమార్‌ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే న న్ను మూడో పెళ్లి చేసుకునేందుకు రాజగోపాల్‌ అనేకరకాల వత్తిడిచేశారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని సంసార జీవితాన్ని నెట్టుకొచ్చాను. అయితే దీన్ని సహించలేని రాజగోపాల్‌ తన మనుషులతో భర్తను కిడ్నాప్‌ చేయించి కిరాతకంగా హత్యచేశాడు. చిన్న వయసులో నా చుట్టూ ఏర్పడిన సమస్యలతో జీవితాన్ని దారుణంగా నష్టపోయాను. అయితే వాటన్నింటినీ తట్టుకుని న్యాయపోరాటం చేసి రాజగోపాల్‌ను దోషిగా నిలబెట్టగలిగాను. అయితే తన అనారోగ్యాన్ని కారణంగా చూపిన రాజగోపాల్‌ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. అంతేగాక రాజగోపాల్‌ మరణం వల్ల నా భర్త ఆత్మశాంతించదు, నాకు హృదయానికి మానని గాయంగా మిగిలిపోగలదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement