చెన్నై: డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ఎస్ భారతి(73)ని శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. షెడ్యూల్ కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దళిత సంస్థ ఆది తమిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు అలందూర్‌లోని ఆయన నివాసంలో ఆర్‌ఎస్ భారతిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కలైంజర్ రీడింగ్ సర్కిల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎస్సీలను కించేపరిచే విధంగా ఆర్‌ఎస్ భారతి వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయనను రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం తనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు)
‘అవినీతి కేసులో డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంపై నిన్న ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. కోయంబత్తూరులో బ్లీచింగ్ పౌడర్‌ను సుమారు 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంలో అక్రమాల గురించి ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధమవుతున్నాము. మీరు దువ్వెనను దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు. నేను జైలులో ఉన్నప్పటికీ, మా న్యాయవాదుల బృందం ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తుంద’ని అన్నారు. కాగా, భారతికి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఫిబ్రవరిలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆర్‌ఎస్ భారతి వాపోయారు. ‘తర్వాతి రోజే మీకు(మీడియా) క్షమాపణ చెప్పాన’ని ఆయన గుర్తు చేశారు. (కరోనా కన్నా లాక్‌డౌన్ మరణాలే ఎక్కువ!)
Comments
Please login to add a commentAdd a comment