నాంజిల్ సంపత్, కిరణ్‌బేడీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే ప్రచారార్భాటాలు ఎలా ఉన్నా మహిళలపై ఆ పార్టీ నేతల వ్యంగ్యపూర్తి వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా డీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ గురువారం పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వివాదానికి తెరదీశారు. ఇటీవల డీఎంకే, డీఎండీకే వర్గాల ఘర్షణ నేపథ్యంలో డీఎంకే కోశాధికారి దురైమురుగన్ డీఎండీకే కోశాధికారి ప్రేమలతపై పరుషమైన వ్యాఖ్యలు చేయడం, ఆ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించిన మీడియా ప్రతినిధులపై ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
ఆ తరువాత డీఎంకే నేత, నటుడు రాధారవి నటి నయనతారను కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేసి అప్రతిష్టపాలయ్యారు. రాధారవి మాటలు పార్టీకి నష్టదాయకమని భావించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నయనతార వివాదం పూర్తిగా సద్దుమణిగేలోపు డీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీపై మరో వివాదాస్పద బాంబు పేల్చారు. డీఎంకే, అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలను మార్చి ఇక రాజకీయాలు వద్దుబాబోయ్ అంటూ ప్రకటించారు. అయితే ఎన్నికల తరుణంలో మరలా మనసు మార్చుకుని డీఎంకే కోసం వేదికలు ఎక్కుతా అంటూ పార్టీ ఫ్రీలాన్స్ అధికార ప్రతినిధిగా రంగంలోకి దిగారు.
ఇదిలా ఉండగా, గురువారం పుదుచ్చేరీలో ఎన్నికల ప్రచారం చేస్తూ, దేశంలో 22 రాష్ట్రాలకు బీజేపీ గవర్నర్లు ఉన్నారు, ఇక్కడ (పుదుచ్చేరీ) కూడా ఒక అమ్మ కిరణ్‌బేడీ గవర్నర్‌గా ఉన్నారు. అయితే కిరణ్‌బేడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక ‘మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. డీఎంకే నేతలు మహిళలపై ఇలా వరుస వ్యాఖ్యానాలకు తావివ్వడం ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు తలనొప్పిగా మారిందనడంలోనూ, సహించరనడంలోనూ సందేహం లేదు. రాధారవిని వెంటనే సస్పెండ్ చేసిన స్టాలిన్ తాజా పరిణామాల నేపథ్యంలో నాంజిల్ సంపత్‌పై ఎలాంటి క్రమశిక్షణ తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment