Nanjil Sampath
-
కిరణ్‌బేడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే ప్రచారార్భాటాలు ఎలా ఉన్నా మహిళలపై ఆ పార్టీ నేతల వ్యంగ్యపూర్తి వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా డీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ గురువారం పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వివాదానికి తెరదీశారు. ఇటీవల డీఎంకే, డీఎండీకే వర్గాల ఘర్షణ నేపథ్యంలో డీఎంకే కోశాధికారి దురైమురుగన్ డీఎండీకే కోశాధికారి ప్రేమలతపై పరుషమైన వ్యాఖ్యలు చేయడం, ఆ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించిన మీడియా ప్రతినిధులపై ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తరువాత డీఎంకే నేత, నటుడు రాధారవి నటి నయనతారను కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేసి అప్రతిష్టపాలయ్యారు. రాధారవి మాటలు పార్టీకి నష్టదాయకమని భావించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నయనతార వివాదం పూర్తిగా సద్దుమణిగేలోపు డీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీపై మరో వివాదాస్పద బాంబు పేల్చారు. డీఎంకే, అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలను మార్చి ఇక రాజకీయాలు వద్దుబాబోయ్ అంటూ ప్రకటించారు. అయితే ఎన్నికల తరుణంలో మరలా మనసు మార్చుకుని డీఎంకే కోసం వేదికలు ఎక్కుతా అంటూ పార్టీ ఫ్రీలాన్స్ అధికార ప్రతినిధిగా రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, గురువారం పుదుచ్చేరీలో ఎన్నికల ప్రచారం చేస్తూ, దేశంలో 22 రాష్ట్రాలకు బీజేపీ గవర్నర్లు ఉన్నారు, ఇక్కడ (పుదుచ్చేరీ) కూడా ఒక అమ్మ కిరణ్‌బేడీ గవర్నర్‌గా ఉన్నారు. అయితే కిరణ్‌బేడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక ‘మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. డీఎంకే నేతలు మహిళలపై ఇలా వరుస వ్యాఖ్యానాలకు తావివ్వడం ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు తలనొప్పిగా మారిందనడంలోనూ, సహించరనడంలోనూ సందేహం లేదు. రాధారవిని వెంటనే సస్పెండ్ చేసిన స్టాలిన్ తాజా పరిణామాల నేపథ్యంలో నాంజిల్ సంపత్‌పై ఎలాంటి క్రమశిక్షణ తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
దినకరన్‌కు సీనియర్ నేత ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’లో ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ వైదొలిగారు. మరే పార్టీలో చేరనని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటునానని తెలిపారు. నాంజిల్తోపాటు మరికొందరు దినకరన్ అనుచర నేతలు సైతం అదేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే ద్రవిడ సిద్ధాంతాలు, అన్నాదురైకి చోటు లేకుండా కేవలం జయలలిత బొమ్మతో నెగ్గుకురావడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. అమ్మను అవమానిస్తున్నారు: దినకరన్ తన పార్టీ పతాకంలో జయలలిత బొమ్మవేయడాన్ని తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలగడం ద్వారా నాంజిల్ సంపత్ అమ్మను అవమానించాడని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన ఎంతో సీనియర్ డీఎంకే, ఎండీఎంకేల నుంచి అన్నాడీఎంకేలో చేరినవారన్నారు. ఇపుడే తానేదో పచ్చి అబద్ధాలు చెబుతున్నానని చెప్పడాన్ని అంగీకరించనని అన్నారు. పార్టీ ఏర్పాటు, పేరు నిర్ణయాన్ని అందరితోనూ చర్చించలేనని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కొరుకుంటున్నారో అదిమాత్రమే తాను చేయగలనని అన్నారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దికరన్ ప్రకటించారు. -
కొంప ముంచిన టీవీ ఇంటర్వ్యూలు
ఊడిన పదవి తన గోతిని తానే తవ్వుకున్న వైనం కొంపముంచిన టీవీ ఇంటర్వ్యూలు సాక్షి, చెన్నై :అన్నాడీఎంకే సిద్ధాంతాల ప్ర చార ఉప కార్యదర్శి నాంజిల్ సంపత్‌కు ఆ పార్టీ అధినేత్రి జయలలిత షాక్ ఇచ్చారు. పదవి నుంచి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీవీ ఇంటర్వ్యూల రూపంలో తన గోతిని తానే నాంజిల్ తవ్వుకుని ఉండడం గమనార్హం. ‘నాంజిల్ సంపత్’ రాజకీయ అవగాహన కల్గిన పటిష్ట నేత, పరిస్థితులకు అనుకూలంగా అనర్గళంగా ప్రసంగించే వ్యాఖ్యాత. వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు వెన్నెముకగాఉన్న ఆయన ఇటీవలే అన్నాడీఎంకే గూటికి చేరారు. అన్నాడీఎంకేలోకి రాగానే, సీఎం, ఆ పార్టీ అధినేత్రి జయలలిత నాంజిల్‌కు మంచి గుర్తింపునే ఇచ్చారు. పార్టీ సిద్ధాం తాల ప్రచార ఉప కార్యదర్శి పదవిని అప్పగించారు. ఓ ఇన్నోవా కారును సైతం అందించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటన సాగించేందుకు అవకాశం ఇచ్చారు. నాంజిల్ లేనిదే అన్నాడీఎంకే బహిరంగ సభలు లేదన్నట్టుగా ఎదిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రచారాలకు నాంజిల్ కీలకంగా మారారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో నాంజిల్‌కు పెద్ద షాక్ ఇస్తూ జయలలిత నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. పార్టీ నుంచి పొమ్మని పొగ పెట్టకున్నా, నాంజిల్ చేతిలో ఉన్న పదవిని మాత్రం లాక్కోవడం గమనార్హం. ప్రచార ఉప కార్యదర్శి పదవిని నుంచి ఆయన్ను తొలగించడంతో సోషల్ మీడియాల్లో సెటైర్లు బయలు దేరాయి. పదవి ఊడింది...మిగిలింది ఇన్నోవానే, తన గోతిని తానే తవ్వుకున్న వ్యాఖ్యాత... అన్న చమత్కారాలు, వ్యంగ్యాస్త్రాలను నాంజిల్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీ ఇంటర్వ్యూలు : తన అనుమతి లేనిదే ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కన్నెర్ర చేయడం జయలలితకు అలవాటే. ఆ దిశగా ఇటీవల టీవీలో సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ మాజీ డీజీపీ ఆర్ నటరాజ్‌కు ఉద్వాసన పలికారు. అయితే, ఆ ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది తాను కాదంటూ నటరాజ్ వివరణ ఇచ్చుకుని మళ్లీ చడి చప్పుడు కాకుండా పార్టీలోకి వచ్చారు. ఈ సమయంలో, పార్టీ సిద్ధాంతాల ప్రచార ఉప కార్యదర్శిగా తనకు జయలలిత ఇచ్చిన అధికారాల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో తన గోతిని తానే నాంజిల్ తవ్వుకున్నారని చెప్పవచ్చు. పార్టీ తరపున టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో చురుగ్గానే నాంజిల్ రాణించారు. అదే సమయంలో శనివారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాంజిల్ వ్యాఖ్యలు వ్యంగ్యాస్త్రాలకు, ప్రజల్లో ఆగ్రహానికి దారి తీశాయని చెప్పవచ్చు. ఆ ప్రశ్నల్లో కొన్ని..వరద బాధితుల్ని అమ్మ పరామర్శించ లేదే అన్న ప్రశ్నకు, అమ్మకు రాలేని పరిస్థితి అని సమాధానం ఇవ్వడంతో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అనుమానాల్ని రెకెత్తించేలా చేశారు. వరదల వేళ అన్నాడీఎంకే సర్వ సభ్యంలో హంగులు అవసరామా.? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో కాస్త దూకుడును నాంజిల్ ప్రదర్శించారు. ఓ గ్రామంలోని ఓ ఇంట్లో విషాదం ఉంటే, మరో ఇంట్లో పెళ్లి జరగకూడదా, వరదల నుంచి ప్రజలు ఎప్పుడో కోలుకున్నారని, కొందరు మాత్రమే కోలుకావాల్సి ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం జయలలితలో ఆగ్రహాన్ని రేపాయి. అన్నాడీఎంకే సర్కారు అప్పుల ఊబిలో ఉన్నట్టుందే..? అన్న ప్రశ్నకు, అప్పులు తీసుకోవడం సహజమే, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. అన్నాడీఎంకేకు ఎదురుగా ఇది వరకు ప్రతి పక్షం లేదని, ఇప్పుడు ప్రతి పక్షం అన్నది బలంగానే అవతరించి ఉన్నదంటూ పరోక్షంగా డీఎంకే బలం పెరిగినట్టు స్పందించారు. ఇక, ఇన్నోవా ఇచ్చారు సరే, తనకు ఇళ్లు ఎక్కడ..? వరద బాధిత గుడిసె వాసులకు ఇస్తున్నట్టుగానే, తనకు ఇవ్వొచ్చుగా..! అని వ్యాఖ్యలు చేసిన తాను తవ్వుకున్న గోతిలోనే నాంజిల్ పడి ఉండటం గమనించాల్సిన విషయం. అలాగే, మరో టీవీ ఛానల్‌కు తమకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా పదే పదే నాంజిల్ స్పందించిన కొన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రత్యేకంగా ప్రొమో ఇస్తూ, చూస్తూ ఉండండి..చూస్తూ ఉండండి అని పబ్లిసిటీ ఇవ్వడం జయలలితకు మరింత ఆగ్రహాన్ని తెప్పించి, పార్టీ నుంచి సాగనంప కుండా , పదవి నుంచి తొలగించి పొమ్మని చెప్పకనే పొగ పెట్టినట్టుగా వ్యవహరించి ఉండడం గమనార్హం. అయితే, తదుపరి నాంజిల్ అడుగులు ఎలా ఉంటాయో అన్న ఎదురు చూపుల్లో ఆయన మద్దతు దారులు ఉన్నారు. ఇక, ద్రవిడ సిద్ధాంతాలను అనుసరించే నాంజిల్‌కు దిక్కు డీఎంకే మాత్రమే. -
ఘన విజయం సాధిస్తా
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. గుమ్మిడిపూండి బజారు వీధిలో అన్నాడీఎంకే యూనియన్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జయలలిత 66వ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు గుమ్మిడిపూండి యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి వి గోపాల్‌నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి బివి రమణ, ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ పాల్గొన్నారు. నాంజిల్ సంపత్ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామనే గట్టి ధీమాతోనే ముఖ్యమంత్రి జయలలిత 40 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అమ్మ ప్రభంజనం తట్టుకోలేక కూటమి కోసం పాకులాడుతున్నాయన్నారు. రాజీవ్ హంతకులు గత 23 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నారన్నారు. అయితే సుప్రీంకోర్టు ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవంగా తగ్గించిందని గుర్తు చేశారు. అయితే మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారి విడుదలకు ప్రయత్నిస్తుంంటే కాంగ్రెస్ తీరు దారుణంగా ఉందన్నారు. వారిలో పరివర్తన వచ్చింది అలాంటి వారిని విడుదల చేస్తే ఏమీ నష్టం లేదని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి తమిళులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో లెక్కకు మించి ప్రవేశ పెట్టిన పథకాలు తమకు విజయం తెచ్చి పెట్టనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేను ఓడించాలని విజయకాంత్ కంటున్న కలలు ఫలించవని తెలిపారు. కుల పార్టీలను ప్రోత్సహించవద్దని పీఎంకే, వీసీకే పార్టీలను ఉద్దేశించి అన్నారు. రానున్న కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించనుందని అమ్మను ప్రధాని చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 2,660 మంది వృద్ధులు, మహిళలకు చీరలు, ధోవతులు, 12 టైలరింగ్ మిషన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసభలో ఎమ్మెల్యే మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా ఉపాధ్యక్షుడు అభిరామన్, జిల్లా యువజన శాఖ కార్యదర్శి ముల్లై వెందన్, జిల్లా అమ్మపేరవై అధ్యక్షుడు రమేష్‌కుమార్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మీశ్రీధర్, జిల్లా కౌన్సిలర్లు ఎస్ శ్రీధర్, నారాయణమూర్తి, యూనియన్ కౌన్సిలర్లు సురేష్‌రాజు, కౌన్సిలర్లు ఎన్ శ్రీధర్, నారాయణమూర్తి, యూనియన్ కౌన్సిలర్లు సురేష్‌రాజు, గణపతి, గోపి, పార్టీ నాయకులు సిఎంఆర్ మురళితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.