గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. గుమ్మిడిపూండి బజారు వీధిలో అన్నాడీఎంకే యూనియన్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జయలలిత 66వ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు గుమ్మిడిపూండి యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి వి గోపాల్‌నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి బివి రమణ, ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ పాల్గొన్నారు. నాంజిల్ సంపత్ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామనే గట్టి ధీమాతోనే ముఖ్యమంత్రి జయలలిత 40 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అమ్మ ప్రభంజనం తట్టుకోలేక కూటమి కోసం పాకులాడుతున్నాయన్నారు. రాజీవ్ హంతకులు గత 23 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నారన్నారు.
అయితే సుప్రీంకోర్టు ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవంగా తగ్గించిందని గుర్తు చేశారు. అయితే మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారి విడుదలకు ప్రయత్నిస్తుంంటే కాంగ్రెస్ తీరు దారుణంగా ఉందన్నారు. వారిలో పరివర్తన వచ్చింది అలాంటి వారిని విడుదల చేస్తే ఏమీ నష్టం లేదని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి తమిళులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో లెక్కకు మించి ప్రవేశ పెట్టిన పథకాలు తమకు విజయం తెచ్చి పెట్టనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేను ఓడించాలని విజయకాంత్ కంటున్న కలలు ఫలించవని తెలిపారు. కుల పార్టీలను ప్రోత్సహించవద్దని పీఎంకే, వీసీకే పార్టీలను ఉద్దేశించి అన్నారు.
రానున్న కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించనుందని అమ్మను ప్రధాని చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 2,660 మంది వృద్ధులు, మహిళలకు చీరలు, ధోవతులు, 12 టైలరింగ్ మిషన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసభలో ఎమ్మెల్యే మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా ఉపాధ్యక్షుడు అభిరామన్, జిల్లా యువజన శాఖ కార్యదర్శి ముల్లై వెందన్, జిల్లా అమ్మపేరవై అధ్యక్షుడు రమేష్‌కుమార్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మీశ్రీధర్, జిల్లా కౌన్సిలర్లు ఎస్ శ్రీధర్, నారాయణమూర్తి, యూనియన్ కౌన్సిలర్లు సురేష్‌రాజు, కౌన్సిలర్లు ఎన్ శ్రీధర్, నారాయణమూర్తి, యూనియన్ కౌన్సిలర్లు సురేష్‌రాజు, గణపతి, గోపి, పార్టీ నాయకులు సిఎంఆర్ మురళితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘన విజయం సాధిస్తా
Published Fri, Feb 28 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement