Gummidipundi
-
278 మందికి తాళికి బంగారం పంపిణీ
గుమ్మిడిపూండి: తాళికి బంగారం పథకం కింద 278మంది పేద యువతుల వివాహానికి బంగారం పంపిణీ కార్యక్రమం గుమ్మిడిపూండిలో ఆదివారం జరిగింది. స్థానిక బీడీవో కార్యాలయంలో గుమ్మిడిపూండి, ఎల్లాపురం యూనిట్లకు చెందిన లబ్ధిదారులకు తాళికి బంగారాన్ని గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అందజేశారు. కార్యక్రమానికి బీడీవో దయానిధి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే విజయకుమార్ పాల్గొన్నారు. ముందుగా పది, ప్లస్ టు చదివి వివాహం చేసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద యువతులు 278మందికి ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారాన్ని పంపిణీ చేశారు. అలాగే పేద యువతులు పెళ్లి చేసుకుంటే 10, 12, తరగతులు చదివే వారికి రూ.25వేలు, డిగ్రీ చదివిన వారికి రూ.50వేలు చొప్పున 86 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను అభివృద్ధిపరచుకోవాలని కోరారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి మీనా, అడిషనల్ బీడీవో ఉమాదేవి, జిల్లా మాజీ కౌన్సిలర్ నారాయణమూర్తి, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి ఎం.కె.శేఖర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం
గుమ్మిడిపూండి: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమే అని రెడ్‌హిల్స్ ఆర్టీవో సంపత్‌కుమార్ అన్నారు. కవరపేట సమీపంలోని పెరువాయిల్ గ్రామంలో ఉన్న టీజేఎస్. పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఒక్క రోజు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు కళాశాల చైర్మన్ టి.జె.గోవిందరాజన్, ఆర్టీవో సంపత్‌కుమార్ హాజరయ్యారు. ఆర్టీవో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు ఆత్మవిశ్వాసం, సహనంతో వాహనాలు నడపాలని కోరారు. ప్రయాణికుల భద్రత డ్రైవర్ల చేతుల్లో ఉందన్నారు. 2013లో తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15,563 మంది మృతి చెందారని వీరిలో ద్విచక్ర వాహనచోదకులు 80 శాతం మంది ఉన్నారని తెలిపారు. అందుకు ప్రధాన కారణం అతివేగం, హెల్మెట్ ధరించకపోవడమే అన్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే, తమిళనాడు ఇండియాలో మొదటి వరసలో ఉందని చెప్పారు. అందుకే తమ శాఖ తరపున విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన నిబంధనలను వివరిస్తూ , 45 నిమిషాల పాటు టెలిఫిల్మ్ను ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ తిరునావుక్కరసు, ఏవో.బాబు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
17 చోట్ల మొరాయించిన ఈవీఎంలు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పార్లమెంటు ఎన్నికలు గురువారం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యాయి. గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలోని పూండి, పెరియపాలెం, గుమ్మిడిపూండిలో 17 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 11.30 గంటలకు దాదాపు 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అలాగే పెరియపాలెంలోని నైవేలి గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో వేసిన ఓట్లన్నీ అధికార పార్టీకి పడుతుండడంతో ఓటర్లు ఫిర్యాదు చేయడంతో పోలింగ్ ఆపి మరో మిషన్‌తో పోలింగ్ నిర్వహించారు. నొచ్చికుప్పం, ఆరంబాక్కం, చిన్నంబేడు జాలర్లు తమపై జరిగిన దాడిలో అధికార పార్టీ నిర్లక్ష్యం చేసిందని, మూడు గ్రామాల జాలర్లు ఓటు వేసేందుకు రాలేదు. కనీసం ఏజెంట్లు సైతం పోలింగ్ బూత్‌కు రాలేదు. అధికారులు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావుకు సమాచారం అందించడంతో ఆయన ఆదేశానుసారంగా గుమ్మిడిపూండి తహశీల్దారు శంకరి వచ్చి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 16 మంది యువకులు మాత్రం వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుమ్మిడిపూండి బజారు వీధిలోని ఏఎల్కే ప్రభుత్వ మహోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సీహెచ్. శేఖర్, ఆయన సతీమణి మయూరి వచ్చి ఓటు వేశారు. మొత్తం మీద గుమ్మిడిపూండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలీసులు ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జాలర్ల మధ్య ఘర్షణ
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: ఇటీవల సద్దుమణిగిన గొడవలు మళ్లీ రాజుకున్నాయి. ఈసారి ఇళ్లకు నిప్పు పెట్టే స్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రా-తమిళనాడు జాలర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన పలవేర్కాడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పొన్నేరి సమీపంలోని పలవేర్కాడు గ్రామం వద్ద ఉన్న పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గొడవలు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. అయితే వారం క్రితం ఆంధ్రా జాలర్లు తమ పరిధిలోకి వచ్చి చేపలు పట్టారని పలవేర్కాడు జాలర్లు ఆంధ్రా జాలర్లకు చెందిన 120 వలలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. తిరువళ్లూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్ల సమక్షంలో గుమ్మిడిపూండిలో శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. కానీ శనివారం తెల్లవారుజామున ఆంధ్రా జాలర్లు పలవేర్కాడు సమీపంలోని చిన్నమాంగాడు గ్రామానికి వచ్చి పడవల్లో ఉన్న వలలకు, 10 ఇళ్లకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా ఇళ్లు తగులబడడంతో గ్రామస్తులు, భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బాంబులు వేశారు. పెద్ద శబ్దంతో మంటలు రేగడంతో మహిళలు పెద్దగా కేకలు వే స్తూ రోడ్లపైకి వచ్చారు. తర్వాత జాలర్లు వలలను పెట్రోలు పోసి కాల్చివేశారు. దీంతో ఆంధ్రా-తమిళనాడు జాలర్లు రాళ్లు, బరిసెలు, విల్లులతో దాడులు చేసుకున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రెండు గంటల పాటు రాళ్లు, కత్తులతో యుద్ధభూమిని తలపించింది. విషయం తెలుసుకున్న అడిషనల్ డీఎస్పీ స్టాలిన్, సీఐ రాజారాబర్ట్, డీఎస్పీ ఇళంగోల ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు వచ్చి దాడుల నివారణ కోసం మైక్‌లో జాలర్లతో చర్చించారు. దీంతో ఆంధ్రా జాలర్లు పోలీసులపై రాళ్లు, విల్లులతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి. గ్రామంలో అరుపులు, రాళ్లు రువ్వకోవడంతో ముఖ్యంగా మహిళలు, పిల్లలు భయాందోళన చెందారు. తర్వాత ఏడీఎస్పీ స్టాలిన్ జాలర్లతో చర్చించారు. రెండు ప్రాంతాల జాలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రా నుంచి తడ, నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. ఆంధ్రా, తమిళనాడు పోలీసులు సరిహద్దు ప్రాంతంలో భారీ పోలీసు బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మూడు గంటల దాడుల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన పోలీసులను చికిత్స కోసం పొన్నేరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అసలే ఎన్నికల సమయం కావడం, రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య గొడవలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
ఘన విజయం సాధిస్తా
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. గుమ్మిడిపూండి బజారు వీధిలో అన్నాడీఎంకే యూనియన్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జయలలిత 66వ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు గుమ్మిడిపూండి యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి వి గోపాల్‌నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి బివి రమణ, ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ పాల్గొన్నారు. నాంజిల్ సంపత్ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామనే గట్టి ధీమాతోనే ముఖ్యమంత్రి జయలలిత 40 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అమ్మ ప్రభంజనం తట్టుకోలేక కూటమి కోసం పాకులాడుతున్నాయన్నారు. రాజీవ్ హంతకులు గత 23 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నారన్నారు. అయితే సుప్రీంకోర్టు ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవంగా తగ్గించిందని గుర్తు చేశారు. అయితే మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారి విడుదలకు ప్రయత్నిస్తుంంటే కాంగ్రెస్ తీరు దారుణంగా ఉందన్నారు. వారిలో పరివర్తన వచ్చింది అలాంటి వారిని విడుదల చేస్తే ఏమీ నష్టం లేదని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి తమిళులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో లెక్కకు మించి ప్రవేశ పెట్టిన పథకాలు తమకు విజయం తెచ్చి పెట్టనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేను ఓడించాలని విజయకాంత్ కంటున్న కలలు ఫలించవని తెలిపారు. కుల పార్టీలను ప్రోత్సహించవద్దని పీఎంకే, వీసీకే పార్టీలను ఉద్దేశించి అన్నారు. రానున్న కేంద్ర ప్రభుత్వంలో అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించనుందని అమ్మను ప్రధాని చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 2,660 మంది వృద్ధులు, మహిళలకు చీరలు, ధోవతులు, 12 టైలరింగ్ మిషన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసభలో ఎమ్మెల్యే మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా ఉపాధ్యక్షుడు అభిరామన్, జిల్లా యువజన శాఖ కార్యదర్శి ముల్లై వెందన్, జిల్లా అమ్మపేరవై అధ్యక్షుడు రమేష్‌కుమార్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మీశ్రీధర్, జిల్లా కౌన్సిలర్లు ఎస్ శ్రీధర్, నారాయణమూర్తి, యూనియన్ కౌన్సిలర్లు సురేష్‌రాజు, కౌన్సిలర్లు ఎన్ శ్రీధర్, నారాయణమూర్తి, యూనియన్ కౌన్సిలర్లు సురేష్‌రాజు, గణపతి, గోపి, పార్టీ నాయకులు సిఎంఆర్ మురళితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అధికారులు వేధింపులు మానుకోవాలి
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు వేధింపులు మానుకోవాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ అన్నారు. రెడ్‌హిల్స్‌లో ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం మహానాడు జరిగింది. ఈ సభకు తిరువళ్లూరు జిల్లా సంఘ అధ్యక్షుడు రాజా, ముఖ్య అతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ పాల్గొన్నారు. కనకరాజ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తనిఖీలు చేస్తూ వేధిస్తున్నారని చెప్పారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలను చిన్నచూపు చూస్తోందన్నారు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ముందుగానే అధికారులు పాఠశాలలపై దాడులు చేసి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందిపడి అనేక పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. అలాంటి పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 10 సంవత్సరాలైన పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని, ఉపాధ్యాయుల నియామకంలో షరతులు సడలించాలనే తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఈ సభ సంఘ కార్యదర్శి నందకుమార్, వల్లేనాయక్, జోర్నాల్డ్తో పాటు పలువురు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.