రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమే అని రెడ్‌హిల్స్ ఆర్టీవో సంపత్‌కుమార్ అన్నారు. కవరపేట సమీపంలోని పెరువాయిల్ గ్రామంలో ఉన్న టీజేఎస్.
గుమ్మిడిపూండి: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమే అని రెడ్‌హిల్స్ ఆర్టీవో సంపత్‌కుమార్ అన్నారు. కవరపేట సమీపంలోని పెరువాయిల్ గ్రామంలో ఉన్న టీజేఎస్. పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఒక్క రోజు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు కళాశాల చైర్మన్ టి.జె.గోవిందరాజన్, ఆర్టీవో సంపత్‌కుమార్ హాజరయ్యారు. ఆర్టీవో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు ఆత్మవిశ్వాసం, సహనంతో వాహనాలు నడపాలని కోరారు. ప్రయాణికుల భద్రత డ్రైవర్ల చేతుల్లో ఉందన్నారు. 2013లో తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15,563 మంది మృతి చెందారని వీరిలో ద్విచక్ర వాహనచోదకులు 80 శాతం మంది ఉన్నారని తెలిపారు.
అందుకు ప్రధాన కారణం అతివేగం, హెల్మెట్ ధరించకపోవడమే అన్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే, తమిళనాడు ఇండియాలో మొదటి వరసలో ఉందని చెప్పారు. అందుకే తమ శాఖ తరపున విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన నిబంధనలను వివరిస్తూ , 45 నిమిషాల పాటు టెలిఫిల్మ్‌ను ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ తిరునావుక్కరసు, ఏవో.బాబు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.