గుమ్మిడిపూండి: తాళికి బంగారం పథకం కింద 278మంది పేద యువతుల వివాహానికి బంగారం పంపిణీ కార్యక్రమం గుమ్మిడిపూండిలో ఆదివారం జరిగింది. స్థానిక బీడీవో కార్యాలయంలో గుమ్మిడిపూండి, ఎల్లాపురం యూనిట్‌లకు చెందిన లబ్ధిదారులకు తాళికి బంగారాన్ని గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అందజేశారు. కార్యక్రమానికి బీడీవో దయానిధి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే విజయకుమార్ పాల్గొన్నారు. ముందుగా పది, ప్లస్ టు చదివి వివాహం చేసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద యువతులు 278మందికి ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారాన్ని పంపిణీ చేశారు. అలాగే పేద యువతులు పెళ్లి చేసుకుంటే 10, 12, తరగతులు చదివే వారికి రూ.25వేలు, డిగ్రీ చదివిన వారికి రూ.50వేలు చొప్పున 86 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను అభివృద్ధిపరచుకోవాలని కోరారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి మీనా, అడిషనల్ బీడీవో ఉమాదేవి, జిల్లా మాజీ కౌన్సిలర్ నారాయణమూర్తి, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి ఎం.కె.శేఖర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment