జాలర్ల మధ్య ఘర్షణ | attacks between the parties fishermes | Sakshi
Sakshi News home page

జాలర్ల మధ్య ఘర్షణ

Published Sat, Apr 12 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

attacks between the parties fishermes

 గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: ఇటీవల సద్దుమణిగిన గొడవలు మళ్లీ రాజుకున్నాయి. ఈసారి ఇళ్లకు నిప్పు పెట్టే స్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రా-తమిళనాడు జాలర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన పలవేర్కాడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పొన్నేరి సమీపంలోని పలవేర్కాడు గ్రామం వద్ద ఉన్న పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గొడవలు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. అయితే వారం క్రితం ఆంధ్రా జాలర్లు తమ పరిధిలోకి వచ్చి చేపలు పట్టారని పలవేర్కాడు జాలర్లు ఆంధ్రా జాలర్లకు చెందిన 120 వలలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. తిరువళ్లూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్ల సమక్షంలో గుమ్మిడిపూండిలో శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. కానీ శనివారం తెల్లవారుజామున ఆంధ్రా జాలర్లు పలవేర్కాడు సమీపంలోని చిన్నమాంగాడు గ్రామానికి వచ్చి పడవల్లో ఉన్న వలలకు, 10 ఇళ్లకు నిప్పు పెట్టారు. 
 
 ఒక్కసారిగా ఇళ్లు తగులబడడంతో గ్రామస్తులు, భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బాంబులు వేశారు. పెద్ద శబ్దంతో మంటలు రేగడంతో మహిళలు పెద్దగా కేకలు వే స్తూ రోడ్లపైకి వచ్చారు. తర్వాత జాలర్లు వలలను పెట్రోలు పోసి కాల్చివేశారు. దీంతో ఆంధ్రా-తమిళనాడు జాలర్లు రాళ్లు, బరిసెలు, విల్లులతో దాడులు చేసుకున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రెండు గంటల పాటు రాళ్లు, కత్తులతో యుద్ధభూమిని తలపించింది. విషయం తెలుసుకున్న అడిషనల్ డీఎస్పీ స్టాలిన్, సీఐ రాజారాబర్ట్, డీఎస్పీ ఇళంగోల ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు వచ్చి దాడుల నివారణ కోసం మైక్‌లో జాలర్లతో చర్చించారు. దీంతో ఆంధ్రా జాలర్లు పోలీసులపై రాళ్లు, విల్లులతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి.
 
 గ్రామంలో అరుపులు, రాళ్లు రువ్వకోవడంతో ముఖ్యంగా మహిళలు, పిల్లలు భయాందోళన చెందారు. తర్వాత ఏడీఎస్పీ స్టాలిన్ జాలర్లతో చర్చించారు. రెండు ప్రాంతాల జాలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రా నుంచి తడ, నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. ఆంధ్రా, తమిళనాడు పోలీసులు సరిహద్దు ప్రాంతంలో భారీ పోలీసు బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మూడు గంటల దాడుల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన పోలీసులను చికిత్స కోసం పొన్నేరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అసలే ఎన్నికల సమయం కావడం, రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య గొడవలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement