Chennai police
-
పబ్జీ మొనగాడు.. బూతులతో బుక్కయ్యాడు
చెన్నై: పబ్జీ.. మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అలాంటి గేమ్‌లో మదన్ ఘనాపాటి. తమిళనాడుకు చెందిన మదన్ ఓపీ.. గేమర్, వ్లోగర్ కూడా. యూత్‌లో ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. అంతెందుకు కొందరు సెలబ్రిటీలు కూడా ఇతని అభిమానులే. అలాంటి కుర్రాడిపై లైంగిక ఆరోపణల కింద కేసు బుక్ అయ్యింది. అసలు మదన్‌కి ఇంతలా పేరు రావడానికి ముఖ్య కారణం.. పబ్జీ గేమింగ్‌లో అతను ఉపయోగించే భాష. కో-ప్లేయర్స్ గనుక బాగా ఆడకపోతే బండబూతులు తిడతాడు. లైవ్‌లో ఉన్నాననే సంగతి మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ ఆటిట్యూడ్ అతనికి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆటలో అతను ఇచ్చే టిప్స్.. ఇంటర్నేషనల్ వైడ్‌గా అతనికి గుర్తింపు ఇచ్చింది. అయితే రీసెంట్గా ఓ వీడియోలో అతను అమ్మాయిలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలం వాడాడు. దీంతో ఇతగాడి వ్యవహారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చేరింది. శృతి మించారు నిజానికి ఈ కుర్రాడు పబ్లిక్‌కి తెలిసేలా తప్పులన్నీ చేస్తుంటాడు. అతనికి ఉన్న అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగోలా వాళ్ల అమ్మాయిల నెంబర్లు సంపాదించి.. వాళ్లతో మాటలు కలుపుతాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. తేడాగా వ్యవహరిస్తాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలలో న్యూడ్‌గా వీడియో ఛాట్ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఛాటింగ్‌లను, స్క్రీన్ షాట్లను పబ్లిక్‌గానే పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ వ్యవహారంలో బాధిత యువతులనూ ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బహిరంగంగానే చేస్తున్నానని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన మీద కుట్రపన్నారని మదన్ చెప్తున్నాడు. చర్యలు తప్పవా? ఇక తాజాగా విమర్శల నేపథ్యంలో మదన్ దూకుడు తగ్గించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లకు కామెంట్ సెక్షన్‌కు ప్రైవసీ పెట్టాడు. అతని యూట్యూబ్ పేజీలో 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లలో చాలామంది 18 ఏళ్లలోపు వాళ్లే. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ గరం అయ్యింది. కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు చెన్నై పోలీసులు కేసు రిజిస్ట్రర్ చేయడంతో.. త్వరలోనే మదన్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారంతా. ఇది #arrestmadanop పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ కథ. -
రాజ్యసభ సభ్యుడు అరెస్ట్
చెన్నై: డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి(73)ని శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. షెడ్యూల్ కులాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దళిత సంస్థ ఆది తమిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు అలందూర్‌లోని ఆయన నివాసంలో ఆర్ఎస్ భారతిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కలైంజర్ రీడింగ్ సర్కిల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎస్సీలను కించేపరిచే విధంగా ఆర్ఎస్ భారతి వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయనను రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం తనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) ‘అవినీతి కేసులో డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంపై నిన్న ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. కోయంబత్తూరులో బ్లీచింగ్ పౌడర్‌ను సుమారు 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంలో అక్రమాల గురించి ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధమవుతున్నాము. మీరు దువ్వెనను దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు. నేను జైలులో ఉన్నప్పటికీ, మా న్యాయవాదుల బృందం ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తుంద’ని అన్నారు. కాగా, భారతికి ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఫిబ్రవరిలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆర్ఎస్ భారతి వాపోయారు. ‘తర్వాతి రోజే మీకు(మీడియా) క్షమాపణ చెప్పాన’ని ఆయన గుర్తు చేశారు. (కరోనా కన్నా లాక్డౌన్ మరణాలే ఎక్కువ!) -
రూ. 11 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సెంట్రల్ సిటీ చెన్నైలో ఓ హోటల్లో నిర్వహించిన సోదాల్లో 7 కిలోల బంగారం, 11 కోట్ల రూపాయల హవాలా సొమ్మును చెన్నై రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త మైలాపూర్‌లో ఉన్న ప్రముఖ హోటల్లో విదేశీ వ్యక్తుల నుంచి హవాలా సొమ్మును తీసుకోనున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ హోటల్లో గురువారం ఇంటెలిజెన్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో హోటల్లో నుంచి పార్కింగ్ చోటుకు వెళ్లిన ఓ పారిశ్రామికవేత్త తన చేతిలో ఒక తోలు సంచి కలిగి ఉన్నాడు. ఆ బ్యాగును తనిఖీచేయగా అందులో విదేశాల నుంచి తీసుకువచ్చిన ఒక కిలో బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా, ఆ హోటల్లో బసచేసి ఉన్న విదేశీయుల నుంచి ఆ బంగారు బిస్కెట్లను పొందినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ హోటల్లో ఉన్న ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసి విచారించగా, ఒకరోజు క్రితమే తాము దక్షిణ కొరియా నుంచి వచ్చినట్లు, తామే ఆ బంగారు బిస్కెట్లను చెన్నై విమానాశ్రయంలో అధికారుల కళ్లుగప్పి తీసుకువచ్చినట్టు చెప్పారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చెన్నై రెవెన్యూ ఇంటలిజెన్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక దుస్తుల దుకాణ వ్యాపారిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి ఒక కిలో బంగారు బిస్కెట్ ఒకటి, రూ.5.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్ల నుంచి రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బంగారు బిస్కెట్లు హవాలా నగదు తరలింపునకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అదే విధంగా హవాలా సొమ్ము తరలించడానికి ఉపయోగించిన ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
భార్యా, పిల్లలను హతమార్చి, ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై : కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి భార్యా,పిల్లలను దారుణంగా హతమార్చి, అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఉదయం తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై పమ్మల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దామోదరన్ అనే వ్యక్తి ఇవాళ ఉదయం భార్య, ముగ్గురు పిల్లలను కొడవలితో దాడిచేసి నరికి చంపాడు. ఈ సంఘటనలో అతని భార్య, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందగా దాడి అనంతరం తను కూడా కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇంట్లోంచి అరుపులు, కేకలు వినపడడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న దామోదరన్‌ను తాంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెన్నైలో ఎటు చూసినా పోలీసులే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులను నమ్మొద్దని ప్రజలకు చెన్నై పోలీసులు విజ్ఞప్తి చేశారు. ‘అమ్మ’ ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. చెన్నై మొత్తం ఆర్మీ, పోలీసు బలగాలతో నిండిపోయింది. జయలలిత నివాసం పొయెస్ గార్డన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తమిళనాడులోని ప్రధాన నగరాల్లోనూ ముందు జాగ్రత్తగా భద్రత పెంచారు. మరోవైపు ‘అమ్మ’ కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ముంబైలోని శక్తి వినాయక ఆలయంలో అభిమానులు పూజలు చేశారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వార్తల ప్రచారంలో నిగ్రహం పాటించాలని మీడియా సంస్థలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.