సాక్షి, చెన్నై : కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ‍్యక్తి భార్యా,పిల్లలను దారుణంగా హతమార్చి, అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఉదయం తమిళనాడులో చోటుచేసుకుంది. చెన‍్నై పమ‍్మల్ ప్రాంతంలో నివాసం ఉంటున‍్న దామోదరన్ అనే వ‍్యక్తి ఇవాళ ఉదయం భార‍్య, ముగ్గురు పిల‍్లలను కొడవలితో దాడిచేసి నరికి చంపాడు. ఈ సంఘటనలో అతని భార‍్య, ముగ్గురు పిల‍్లలు అక‍్కడికక‍్కడే మృతిచెందగా దాడి అనంతరం తను కూడా కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇంట్లోంచి అరుపులు, కేకలు వినపడడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన‍్న దామోదరన్‌ను తాంబరం ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.