పింప్రి, న్యూస్‌లైన్: దళితుల సంఖ్య అధికంగా ఉన్న పుణే సీటును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కు కేటాయించాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలను కోరారు. అవకాశమిస్తే తానే పోటీచేస్తానని స్పష్టం చేశారు. పుణేలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 35, లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు, ఐదు సీట్లను కేటాయించాలని మహాకూటమిలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలను కోరుతామన్నారు. దీనిపై త్వరలో జరగబోయే మహాకూటమి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పాలన కుంటుపడిందని నిప్పులు చెరిగారు. దళితులపై నేటికి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అట్రాసిటి యాక్ట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. దళితులకు అన్యాయం జరుగుతోందని, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలలో దళిత పరిషత్‌ను ఏర్పాటుచేయనున్నట్లు అథవలే పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర ఆర్పీఐ అధ్యక్షులు మహేంద్ర కాంబ్లే, ఎం.డి.శేవాలే, నగర కార్పొరేటర్లు డాక్టర్ సిద్ధార్థ్ దేండే, మహేష్ షిండే తదితరులు పాల్గొన్నారు.
పుణే సీటిస్తే పోటీ చేస్తా: అథవాలే
Published Mon, Aug 26 2013 11:10 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement