షరతులతో రామ్‌దేవ్ యోగా శిబిరానికి అనుమతి
Published Fri, Oct 11 2013 1:53 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
న్యూఢిల్లీ: నగరంలో యోగా గురువు రామ్‌దేవ్ యోగా శిబిరం నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే ఈ శిబిరాన్ని ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ద్వారకా, నాంగ్లోయ్, శాస్త్రీ పార్క్‌లలో రామ్‌దేవ్ శిబిరాలు ఏర్పాటయ్యాయి. ద్వారకాలో గురువారం నుంచి రామ్‌దేవ్ నడిపే యోగా శిబిరానికి అనుమతి ఇవ్వరాదంటూ దాఖలైన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.
యోగా శిబిర కార్యకలాపాలను విడియో తీయాలని ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ అధికారులను ఆదేశించారు. యోగా శిబిర నిర్వహణకు సంబంధించి తనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది కాబట్టి శిబిరాలపై ఎన్నికల సంఘం కన్నేసి ఉంటుందని ఆయనన్నారు. యోగా శిబిరాల ప్రారంభ, ముగింపు వేడుకలను రాజకీయ నేతలతో జరుపరాదని. వేదికపై రాజకీయ నేతలు ప్రసంగాలు ఇవ్వరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు లిఖిత ఫిర్యాదు అందినట్లయితే చర్య తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. యోగా శిబిరంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రచార సామగ్రిని పంచిపెట్టరాదని, శిబిరం ఏ వ్యక్తి రాజకీయ ప్రచారానికి వేదిక కాకుండా చూడాలని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
శిబిర నిర్వాహకులతో పాటు, ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల కమిషన్ ఆంక్షలను ఉల్లంఘించినట్లయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద చర్య తీసుకుంటామని హెచ్చరించింది. యోగా శిబిర నిర్వహణకు ఇచ్చిన అనుమతిని కూడా ఉపసంహరించుకోవడానికి వెనుకాడబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. యోగా శిబిరం నుంచి ఏదైనా రాజకీయ సందేశం ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా వెలువడినట్లయితే ఎన్నికల కమిషన్ దానిని తీవ్రంగా పరిగణిస్తుందని, మొత్తం ఖర్చును ఎన్నికల ప్రచార వ్యయంలో చేరుస్తామని హెచ్చరించింది. ఈ ఎన్నికల వ్యయాన్ని అభ్యర్థి ఖర్చులో చేరుస్తారు. ఎన్నికల కమిషన్ విధించిన అన్ని ఆంక్షలకు లోబడి శిబిరం నిర్వహిస్తామని నిర్వాకుల నుంచి హామీ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ స్థానిక అధికారులను ఆదేశించింది.
Advertisement
Advertisement