
ఉభయతారకం
క్రీడారంగంతో బాలీవుడ్ అనుబంధం అనేక విధాలుగా లాభదాయకమని ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) లోని ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటాదారుడైన రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నాడు.
క్రీడారంగంతో బాలీవుడ్ అనుబంధం అనేక విధాలుగా లాభదాయకమని ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) లోని ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటాదారుడైన రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నాడు. ఐఎస్‌ఎల్‌లో రణ్‌బీర్ కపూర్‌తోపాటు జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌లు సహయజమానులు కాగా వరుణ్‌ధావన్ గోవా టీం రాయబారి. ‘ఇది అత్యంత గొప్ప విషయం. దేశంలో ప్రతి క్రీడను ప్రోత్సహించాల్సిందే. క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం. అయితే దానర్థం కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి ఆటలను వదిలేస్తామని కాదు. అంతేకాకుండా కబడ్డీ క్రీడాకారుడిగానో లేదా ఫుట్‌బాల్ క్రీడాకారుడిగానో యువతకు అవకాశమిచ్చినవాళ్లమవుతాం. ప్రతి ఒక్కరినీ క్రికెట్ ఆటగాడిగానే మలచాల్సిన పనిలేదు.
’అని ఇటీవల తన ఫుట్‌బాల్ క్లబ్‌ను ప్రారంభించిన రణ్‌బీర్ చెప్పాడు. అభిషేక్ నేతృత్వంలోని ప్రో కబడ్డీ లీగ్ ఫ్రాంచైసీ ఆదివారం రాత్రి జరిగిన ఆటలో విజయం సాధించింది. ఇక జాన్ అబ్రహం... నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్ సహయజమాని. వరుణ్‌ధావన్ గోవా ఫుట్‌బాల్ క్లబ్‌కు రాయబారిగా వ్యవహరిస్తున్నాడు. ‘ఇండియన్ సూపర్‌లీగ్‌లో ప్రమేయం కలిగిన ప్రతి ఒక్కరూ దానిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. ఇందువల్ల మనదేశం తరఫున కూడా మంచి ఫుట్‌బాల్ టీం తయారవుతుంది’అని అన్నాడు. మంచి లీగ్‌ను తయారుచేసే దిశగా అడుగులు వేయాలన్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు మన దేశానికి కూడా ఫుట్‌బాల్ టీం ఉందన్నాడు.