రేప్ కేసులో జైలుకు వెళితే ఫర్లాఫ్ ఉండదు
ముంబై: అత్యాచార కేసులో దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేప్ కేసులో జైలుశిక్ష పడ్డ ఖైదీలకు ఇక మీదట ఫర్లాఫ్ (సెలవు లాంటిది) ఇవ్వరు. సవరించిన జైలు మాన్యువల్లో ఈ మేరకు నిబంధనలను చేర్చారు. కొత్తగా 30 సవరణలతో కూడిన జైలు మాన్యువల్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నోటిఫై చేశారు. ఇందులో రేప్ కేసులో శిక్షపడ్డవారిని ఫర్లాగ్కు అనర్హులుగా చేర్చారు.
సవరించిన మాన్యువల్ను ప్రింటింగ్కు పంపారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టనున్నారు. ఫర్లాఫ్ కింద ఓ ఖైదీకి ఏడాదికి మొత్తం 28 సెలవులుంటాయి. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఒకేసారి 14 రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. అధికారులు అనుమతిస్తే మరో 14 రోజులు సెలవు తీసుకోవచ్చు. ఇక మీదట రేప్ కేసులో ఖైదీలకు ఫర్లాఫ్ తీసుకోవడానికి వీలు ఉండదు. పెరోల్ మంజూరుపైనా కఠిన నిబంధనలు చేర్చారు.